వెలుగు ఓపెన్ పేజీ..టీ క్యాపిటల్ ఆఫ్‌ ది వరల్డ్‌ అస్సాం

వెలుగు ఓపెన్ పేజీ..టీ క్యాపిటల్ ఆఫ్‌ ది వరల్డ్‌  అస్సాం

ప్రపంచవ్యాప్తంగా చాయ్‌  ప్రియులకు కొదవలేదు. చాలామందికి  తేనీరు తాగకపోతే  రోజు గడవదు.  అతిథి మర్యాదలకు టీ ఒక సర్వసాధారణ పానీయం.  తేనీరు ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకునేందుకు  ప్రతి ఏటా మే‌ 21న అంతర్జాతీయ తేనీరు దినోత్సవం (ఇంటర్నేషనల్‌ టీ డే) పాటించుట 2020 నుంచి ఆనవాయితీగా మారింది. 2026 అంతర్జాతీయ టీ దినోత్సవ  ఇతివృత్తంగా  సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం (ఫోస్టరింగ్ గ్రోత్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌) అనే అంశాన్ని తీసుకున్నారు. అదే విధంగా ఐరాస అనుబంధ సంస్థ ‘ఆహారం, వ్యవసాయ సంస్థ’ ప్రకారం.. సుస్థిర టీ సరఫరాతో  పౌర సమాజానికి చేయూత (సస్టేనింగ్‌ టీ, సపోర్టింగ్‌ కమ్యూనిటీస్‌) అనే అంశం కూడా తీసుకోవడం జరుగుతున్నది. 

ప్రపంచ టీ చరిత్ర

ప్రపంచ టీ చరిత్రకు 5,000 ఏండ్లు ఉన్నది.  ప్రపంచ వ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా ప్రజలు టీ ఆధారంగా జీవనోపాధులను పొందుతున్నారు. భారతదేశానికి టీని పరిచయం చేసిన ఘనత  రాబర్ట్‌ ఫార్చ్యూన్​కు  దక్కుతుంది. మన జీవనశైలిలో  చాయ్‌  ఒకభాగంగా మారిపోయింది.  తేనీటిని చైనా మాండరిన్‌ భాషలో ‘చా’ అంటారు.  అరబిక్‌లో ‘షా’ అని,  రష్యన్‌ భాషలో ‘చాయే’ అని, స్వాహిలిలో ‘చాయ్’,  పలు ప్రాంతాల్లో ‘టీ’ అని పిలుస్తారు.   క్రీ. పూ 59లో చైనాలో  మొదలైన టీ పానీయం వేగంగా ప్రపంచవ్యాప్తంగా  విస్తరించింది.  చైనా వైద్యుడు ‘హూడా టువో’ తొలిసారి  తన  రచనలో  టీ ప్రస్తావన తీసుకువచ్చారు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్‌లో, 17వ శతాబ్దంలో బ్రిటీష్‌లో  టీ తాగడం ఒక ఫ్యాషన్‌ అయ్యింది. తర్వాత  బ్రిటీష్​ వలస పాలనలో  భారత్‌లోకి  టీ  ప్రవేశించి  ప్రజలకు అలవాటుగా మారింది.

భారత్‌లో టీ రకాలు

రసాయనపరంగా టీ పొడిలో దాదాపు 3శాతం కెఫీన్‌ ఉంటుంది. కెఫీన్‌తోపాటు టీలో పాలిఫినాల్స్, థియోబ్రోమిన్‌, థియోఫిలిన్‌ అనే క్లాంథైన్, ఉత్ప్రేరకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. టీలో ఉన్న కెఫీన్‌ రసాయనం వల్ల చురుకుదనం పెరగడం జరుగుతుంది.  తేనీరు పలు రకాలుగా ఉంటుంది.  వీటిలో బ్లాక్‌, గ్రీన్, ఓలాంగ్‌, వైట్, డార్క్‌, యెల్లో టీలు అతి ముఖ్యమైనవి. ప్రాంతీయంగా మట్కా, మసాలా, బెల్లం, ఎర్ల్‌ గ్రే, హర్బల్‌, పుయర్, ఫ్లేవర్డ్‌‌ టీ లాంటివి కూడా ఉంటాయి.  డిబ్రుగఢ్‌ను ప్రపంచ టీ నగరంగా,  అస్సాంను ప్రపంచ టీ కేపిటల్‌గా వ్యవహరిస్తారు.  భారత్‌లో తొలిసారి 1839లో అస్సాం టీ కంపెనీ ప్రారంభం అయ్యింది.  భారత్‌లో అత్యధికంగా అస్సాం, బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలు టీ ఉత్పత్తిలో ముందున్నాయి.  మన వంటింటి పానీయంగా టీ  ప్రజాదరణ పొందింది.  

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.