చెన్నైకి గుజరాత్ షాక్.. 89 రన్స్ తేడాతో టైటాన్స్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి CSK ఔట్!

చెన్నైకి గుజరాత్ షాక్.. 89 రన్స్ తేడాతో టైటాన్స్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి CSK ఔట్!

GT vs CSK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు గుజరాత్ టైటాన్స్ (GT) ఊహించని షాక్ ఇచ్చింది. ప్లేఆఫ్స్ రేసులో ‘చావో రేవో’ లాంటి మ్యాచ్‌లో చెన్నైపై 89 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ ఘోర ఓటమితో సీఎస్‌కే ఐపీఎల్ 2026 సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

గుజరాత్ బ్యాటర్ల ఊచకోత:
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లపై చెడుగుడు ఆడుతూ కేవలం 53 బంతుల్లో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (64 రన్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అలాగే వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ సిక్సర్ల తుఫాన్ సృష్టిస్తూ, మెరుపు హాఫ్ సెంచరీ (57 రన్స్) బాదడంతో గుజరాత్ 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు బోర్డును సెట్ చేసింది.

సిరాజ్ విధ్వంసం.. కుప్పకూలిన సీఎస్‌కే: 
కొండంత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కోలుకోలేని షాక్ తగిలింది. గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన స్పెల్ ఫస్ట్ ఓవర్లోనే చెన్నైని దెబ్బకొట్టాడు. సిరాజ్ వేసిన ఫస్ట్ బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16 రన్స్) మరోసారి నిరాశపరిచాడు. సిరాజ్ వేసిన ఒక అద్భుతమైన డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సిరాజ్ బౌలింగ్‌లోనే ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓపెనర్ మాథ్యూ షార్ట్ (24) ను కగిసో రబాడ అవుట్ చేయగా.. కాసేపు క్రీజులో నిలిచిన కార్తీక్ శర్మ (19) రనౌట్ అయ్యాడు. దీంతో చెన్నై 63 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

దూబే, కాంబోజ్ పోరాటం: 
వరుసగా వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన సిక్సర్ల కింగ్ శివమ్ దూబే వచ్చి రావడంతోనే స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించాడు. కానీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ రెండు భారీ సిక్సర్లు బాది కిరాక్ బ్యాటింగ్ చేసినప్పటికీ రషీద్ ఖాన్ స్పిన్ జాలంలో జేసన్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డెవాల్డ్ బ్రెవిస్ (8 రన్స్) కూడా రషీద్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. 14వ ఓవర్ వేసిన కగిసో రబాడ వరుసగా రెండు వికెట్లు పడగొట్టడంతో చెన్నై కథ ముగిసింది. సీఎస్‌కే 140 పరుగులకే ఆలౌట్ కావడంతో గుజరాత్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్లింది.