మిడిల్‌క్లాస్ వర్సెస్ ధనవంతుల మైండ్‌సెట్.. ఇవి తెలిస్తే సంపద సృష్టించటం ఈజీ..

మిడిల్‌క్లాస్ వర్సెస్ ధనవంతుల మైండ్‌సెట్.. ఇవి తెలిస్తే సంపద సృష్టించటం ఈజీ..

డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే.. సంపదను సృష్టించడం మరొక ఎత్తు. చాలా మంది కేవలం జీతం పెరిగితేనే ధనవంతులం అయిపోతామని భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదని ప్రముఖ ఆర్థిక నిపుణులు సీఏ నితిన్ కౌశిక్ చెబుతున్నారు. మధ్యతరగతి ఆలోచనలకి, ధనవంతుల మైండ్‌సెట్‌కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఆయన వివరించారు. 

జీతం వర్సెస్ ఆస్తులు:
చాలామంది మధ్యతరగతి ప్రజలు తమ ఆదాయం పెంచుకోవడంపైనే పూర్తి దృష్టి పెడతారు. జీతం 6 నుంచి 8 శాతం పెరిగితే.. అదే సమయంలో నిత్యావసరాల ధరలు కూడా అంతే వేగంగా పెరుగుతుంటాయి. ఫలితంగా చేతిలో మిగిలేది తక్కువే. కానీ ధనవంతులు తమ సమయాన్ని అమ్మడం కంటే, తమ కోసం పనిచేసే ఆస్తుల సృష్టిపై దృష్టి పెడతారు. ఒక రియల్ ఎస్టేట్ ఆస్తి లేదా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మనం నిద్రపోతున్నప్పుడు కూడా పెరుగుతూ.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులను అందిస్తాయి. దీనినే ధనవంతులు ఫాలో అవుతుంటారు. 

నిర్మాణాత్మక ప్రణాళిక:
సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను కేవలం వ్యక్తిగత పేర్ల మీద ఉంచుకోకుండా.. ట్రస్టులు లేదా HUF వంటి నిర్మాణాల ద్వారా నిర్వహిస్తాయి. దీనివల్ల పన్ను ప్రయోజనాలు ఉండటమే కాకుండా.. భవిష్యత్తులో వారసత్వ తగాదాలు రాకుండా ఉంటాయి. దేశంలో దాదాపు 75 శాతం ఆస్తి వివాదాలు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని డేటా చెబుతోంది. ధనవంతులు సంపద పెరగకముందే దాన్ని కాపాడే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారు.

అప్పు - ఒక ఆయుధం:
అప్పును మధ్యతరగతి వారు లగ్జరీల కోసం లేదా అనవసర ఖర్చుల కోసం వాడతారు. కానీ రిచ్ పీపుల్ మాత్రం అప్పును ఒక పెట్టుబడిగా చూస్తారు. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే క్రమశిక్షణతో కూడిన అప్పును తీసుకుంటారు. అయితే ఈ అప్పు భారం తమ నెలవారీ ఆదాయాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడతారు. అప్పును ఎప్పుడూ లైఫ్‌స్టైల్ అప్ గ్రేడ్ చేయటం కోసం అస్సలు వాడరు.

ఖర్చును విలువగా మార్చడం:
మధ్యతరగతి వారు దేనినైనా ఖర్చు పరంగా చూస్తారు. కానీ ధనవంతులు 'విలువ' పరంగా చూస్తారు. ఉదాహరణకు ఎడ్యుకేషన్ ఒక ఖర్చులా కాకుండా నైపుణ్యాన్ని పెంచే పెట్టుబడిగా భావిస్తారు రిచ్ పీపుల్. ప్రయాణాలను నెట్‌వర్కింగ్ పెంచుకునే అవకాశంగా మలుచుకుంటారు. తాము ఉండే ఇల్లు కూడా ఆదాయాన్ని ఇచ్చేలా ప్లాన్ చేస్తారు. ప్రతి రూపాయి వెచ్చించేటప్పుడు అది భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం ఇస్తుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. 

ఆర్థిక వ్యవస్థ కష్టపడి పనిచేసే వారికంటే.. ముందస్తు ప్లానింగ్ ఉన్నవారికే ఎక్కువ రివార్డులు ఇస్తుంది. సంపద సృష్టించడం అనేది కేవలం వేగంగా పరుగెత్తడం కాదు.. సరైన దిశలో స్థిరంగా నడవడం. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా క్రమశిక్షణతో చిన్న వయసు నుండే ఆస్తుల సృష్టిపై దృష్టి పెడితే.. అది కాలక్రమేణా భారీ సంపదగా మారుతుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు ఆర్థిక స్వేచ్ఛ, స్థిరత్వానికి సంబంధించిన మ్యాటర్ అని తెలుసుకుంటేనే సంపద సృష్టికి నిజమైన మార్గం దొరుకుతుంది.