భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి సివిల్ సర్వీస్ హోదాలు రాజ్యాంగపరంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ప్రజల విశ్వాసం, చట్టపాలన, నిష్పక్షపాత పరిపాలనకు ప్రతీకలుగా ఒకప్పుడు ఈ పదవులు నిలిచేవి. అధికారంతోపాటు బాధ్యత, సేవాభావం, నైతికత కలసి సమాజం మొత్తం ఈ వ్యవస్థలపై అపార గౌరవం కలిగేలా చేసేవి.
కానీ, కాలప్రవాహంలో ఈ హోదాల విలువ క్రమంగా క్షీణిస్తున్నదన్న వాస్తవాన్ని విస్మరించలేం. పదవుల గొప్పతనం కంటే వాటిని నిర్వహించే వ్యక్తుల నిబద్ధత, నైతికత, తటస్థతే అసలైన విలువను సృష్టిస్తుంది. ఈ సత్యాన్ని ఈ తరుణంలో మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
అధికారానికి మూలం రాజ్యాంగమే తప్ప, రాజకీయ అనుగ్రహమో, ప్రజాదరణ పేరుతో జరిగే సన్మానాలో కాదు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులే అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణలతో పట్టుబడుతున్న ఘటనలు ఒకవైపు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులపై రాజకీయ నాయకుల దుర్భాషలు, బెదిరింపులు, ప్రజల ముందే చులకన చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యంగా కాకుండా, చట్ట పాలనపై ప్రజల విశ్వాసానికే గట్టి దెబ్బగా మారుతోంది.
సన్మానాల సంస్కృతి
దీనికి తోడు ‘సన్మానాల సంస్కృతి’ పేరుతో శాలువాలు, పూలదండలు, వివాదాస్పద వ్యక్తులతో వేదికలు పంచుకోవడం పరిపాలనా హుందాతనాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. చట్టానికి ప్రతీకగా ఉండాల్సిన యూనిఫామ్ స్వార్థ ప్రచారానికి వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? కలెక్టర్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎస్పీ చట్ట అమలుకు ప్రధాన అధికారి అన్న రాజ్యాంగ సత్యాన్ని ఇలాంటి దృశ్యాలు మరుగున పడేస్తున్నాయి.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కీలకశాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలు, తొలగింపులు ఆనవాయితీగా మారడం మరో ఆందోళనకర అంశం. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించినవారికి ప్రమోషన్లు, కీలక బాధ్యతలు ‘నజారానా’లా దక్కుతున్నాయన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. గతంలో పదవీ విరమణ చేసిన అధికారులను తిరిగి నియమించి కీలకస్థానాల్లో పెట్టడం, తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యల ఆరోపణలు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థను వెంటాడుతూనే ఉన్నాయి.
పాలక, ప్రతిపక్షాల హెచ్చరికలు
పాలక, ప్రతిపక్షాల పరస్పర రాజకీయ హెచ్చరికల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు నలిగిపోతున్న పరిస్థితి మరింత ప్రమాదకరం. ఒకవైపు పాలకులు కఠినచర్యల హెచ్చరికలు చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు ‘మళ్లీ అధికారంలోకి వస్తే చర్యలు తప్పవు’ అంటూ బెదిరింపులకు దిగడం సాధారణమైపోయింది. ఈ రెండు వైపుల ఒత్తిళ్ల మధ్య అధికారులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తించలేని సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కొనసాగితే చట్ట అమలు బలహీనమై, ప్రజాస్వామ్యంపై నమ్మకం క్షీణించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకే అధికారుల బాధ్యతా హద్దులను స్పష్టంగా నిర్దేశించే విధానపరమైన దిశానిర్దేశం అత్యవసరం. అధికారులను బెదిరించడం, విధుల్లో ఆటంకం కలిగించడం వంటి చర్యలను రాజకీయ వ్యాఖ్యలుగా కాకుండా నేరాలుగా పరిగణించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అధికారులూ సన్మానాలు, రాజకీయ వేదికలు, వ్యక్తిగత ప్రచారాలకు దూరంగా ఉండేలా కండక్ట్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలి. చట్టానికి భయం పునరుద్ధరితమైతేనే అధికార హోదాలకు గౌరవం, ప్రజాస్వామ్యానికి నమ్మకం తిరిగి వస్తాయి.
-నంగె శ్రీనివాస్, సోషల్ ఎనలిస్ట్
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు
