సర్కార్ ఆస్పత్రుల పై నమ్మకం పెంచాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

సర్కార్ ఆస్పత్రుల పై నమ్మకం పెంచాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో పని చేస్తున్న డాక్టర్లు అంకితభావంతో పని చేస్తూ రోగుల నమ్మకాన్ని చూరగొనాలని కలెక్టర్  ఇలా త్రిపాఠి సూచించారు. సర్కార్​ ట్రీట్​మెంట్​పై నమ్మకాన్ని పెంచి మన్ననలు పొందాలన్నారు. గురువారం ఆమె నగరంలోని జీజీహెచ్(గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్)ను విజిట్​ చేశారు. గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని, కావాల్సిన మెడిసిన్స్​ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

నార్మల్​ డెలివరీలు పెంచాలని, మాతాశిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్​లో సీసీ కెమెరాలు అంతరాయం  లేకుండా పని చేసేలా చూడాలని సూచించారు. డాక్టర్లు, స్టాఫ్​ అటెండెన్స్​ చెక్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేస్​ షీట్లు పరిశీలించారు. డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే యాక్షన్​ తీసుకుంటామని వెల్లడించారు. డాక్టర్​ రాములు, జలగం తిరుపతిరావు ఉన్నారు.

భవిత స్టూడెంట్లను అభినందించిన కలెక్టర్​

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం హైదరాబాద్​లో జరిగిన స్టేట్​ లెవెల్​ స్పోర్ట్స్​లో ప్రతిభచాటిన భవిత సెంటర్​ స్టూడెంట్స్​ను కలెక్టర్​ ఇలా త్రిపాఠి అభినందించారు. గురువారం డీఈవో అశోక్​ వారిని కలెక్టరేట్​కు తీసుకొచ్చారు. వారు సాధించిన మెడల్స్, బహుమతులను పరిశీలించి కలెక్టర్​ ప్రత్యేకంగా అభినందించారు. పోటీల కోసం పిల్లలను తీర్చిదిద్దిన  ఐఆర్పీలను కృషి అభినందనీయమన్నారు. సాధారణ పిల్లలతో పోటీ పడేలా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవకాశాలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు నవ్యభారతి గ్లోబల్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన సైన్స్​ఫేర్​ను పరిశీలించారు. 

లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలి

ఆర్మూర్: లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో విజయం సాధించవచ్చని కలెక్టర్  ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జక్రాన్ పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్  రెసిడెన్షియల్  ఇంటర్, డిగ్రీ కాలేజీ వార్షికోత్సవానికి కలెక్టర్​ హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 

ఎప్పటికప్పుడు నైపుణ్యతను మెరుగు పర్చుకుంటే అవకాశాలు తలుపు తడతాయని తెలిపారు. గవర్నమెంట్​ స్కూళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని, ప్రైవేట్, కార్పొరేట్  స్కూల్, కాలేజీ​విద్యార్థులతో పోటీ పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన వారితో పాటు వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్  బహుమతులు అందజేసి అభినందించారు. ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్  కిరణ్మయి, ప్రిన్సిపాల్  అనూష, అర్చన, స్వప్న పాల్గొన్నారు.