T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో అన్ని మ్యాచుల్లో గెలిచి అజేయంగా సూపర్–8కి దూసుకెళ్లిన టీమిండియాను బ్యాటింగ్ సమస్య తీవ్రంగా కలవర పెడుతుంది. ఫిబ్రవరి 22వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగే హై–వోల్టేజ్ పోరుకి ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను సెలెక్షన్ సమస్య వెంటాడుతోంది. గ్రూప్ దశలో వరుసగా గెలిచినప్పటికీ, ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో అతడు వరుసగా డకౌట్స్ కావడంతో విమర్శలకు దారి తీసింది. ఇదే సమయంలో మరో బ్యాటర్ సంజూ శాంసన్ ని తుది జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. డచ్ జట్టుతో మ్యాచ్‌లో అతడు చూపిన వేగవంతమైన క్యామియో ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతుంది.
2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు వరల్డ్ నెంబర్–1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన అభిషేక్, టోర్నమెంట్‌లో మాత్రం తన దారుణంగా విఫలమవుతున్నాడు. పవర్‌ప్లేలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక వరుసగా మూడుసార్లు ఔటవడం అతడిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో టీ20ల్లో ఒక సంవత్సరంలో అత్యధిక సార్లు (5) డకౌట్ అయిన రికార్డును అభిషేక్ సమం చేశాడు. ఈ రికార్డు గతంలో సంజూ శాంసన్ పేరుపై ఉంది. ‘అభిషేక్ వర్సెస్ సంజూ’ గణంకాలపై ఆరా తీస్తున్నారు. కేవలం వ్యక్తిగత పరుగుల గురించే కాదు, జట్టు సమతుల్యత గురించి కూడా ఆలోచన చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
పవర్‌ప్లే:
పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ స్ట్రైక్‌రేట్ 200కి పైగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అతడి స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకుంటే బ్యాటింగ్ లో స్థిరత్వం రావడంతో పాటు కగిసో రబాడా, అన్‌రిక్ నార్ట్జే లాంటి బౌలర్లు చేసే దాడి తగ్గే అవకాశం ఉంటుంది.
మానసిక ప్రభావం:
3 మ్యాచ్‌లలో విఫలమైనందుకే అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే నిర్ణయం.. అతడి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒక పెద్ద ఇన్నింగ్స్‌తోనే జట్టు ఫలితాన్ని మార్చగల సత్తా అభిషేక్‌కు ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
మోమెంటమ్ కొనసాగింపు:
అసిస్టెంట్ కోచ్ సితాంశు కోటక్ చెప్పినట్లుగా.. సూపర్–8 దశలో ప్రతి మ్యాచ్ ఒత్తిడితో కూడినదే, ఇలాంటి సమయంలో అనవసర మార్పులు చేయడం కంటే, ప్రస్తుతం ఉన్న మోమెంటమ్‌ను కొనసాగించడం బెటర్ అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది అన్నారు.
ఓవరాల్ –అనాలిసిస్:
గత ఐసీసీ టోర్నమెంట్లలో మధ్యలో జట్టును మార్చినప్పుడు భారత్ ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాలని జట్టు యాజమాన్యం ఉంది. అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నా, అతడి దూకుడే భారత్‌కు పవర్‌ప్లేలో బలం. సంజూ శాంసన్ అనుభవం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సూపర్–8 లాంటి కీలక దశలో జట్టు సమతుల్యతే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తోంది.
