వాషింగ్టన్: ట్రంప్ టారిఫ్‌లను కొట్టేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అమెరికాకు అవమానకరమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు టారిఫ్‌లను కొట్టేసినా తన దగ్గర ప్లాన్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాకప్ ప్లాన్ త్వరలోనే అమలు చేస్తానని ప్రకటించాడు.
అసలు వివాదం ఏంటంటే..?
రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక ప్రపంచదేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఎగుమతులపై సుంకాలు విధించే దేశాలపై.. అలాగే అగ్రరాజ్యం మాట వినని కంట్రీస్‌ను దారికి తెచ్చేందుకు ట్రంప్ టారిఫ్ అస్త్రం ప్రయోగించాడు. పలు దేశాలపై ఎడాపెడా వాణిజ్య సుంకాలు విధించాడు.
ట్రంప్ చర్యలతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ వాణిజ్య సుంకాలు విధిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఈ పిటిషన్‌ను 9 మంది సభ్యుల ధర్మాసనం విచారించి శుక్రవారం (ఫిబ్రవరి 20) తుది తీర్పు వెలువరించింది.
టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు లేదు: సుప్రీంకోర్టు
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ సుంకాలను రద్దు చేసింది.
అమెరికా రాజ్యాంగ ప్రకారం.. ఇతర దేశాలపై సుంకాలు విధించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం అవసరం. కానీ ట్రంప్ ఇలా చేయలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం) 1977ను ఉపయోగించి వాణిజ్య సుంకాలు విధించింది ట్రంప్ ప్రభుత్వం. వాస్తవానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది.
కానీ ట్రంప్ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించాడు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నేషనల్ ఎమర్జెన్సీ కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించుకుని విస్తృత సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని అమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు ఇవ్వదని అమెరికా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూల్ చేసిన సుంకాలను ట్రంప్ ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
