దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడం పిల్లల నైపుణ్యాభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది. పిల్లల మానసిక ఆరోగ్యం కాపాడి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. ఒత్తిడి రహిత సమాజ నిర్మాణానికి కృషి జరగాలి. జీవన నైపుణ్యాలపై అవగాహన పెంచాలి. తద్వారా బాల్యదశ నుంచే జీవిత విలువను గుర్తింపచేయవచ్చు. ఇందుకు ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి.
ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో బాలలు, యువకులు ఉన్నారు. 18 ఏళ్ల వయస్సులోపు వారు దేశ జనాభాలో సుమారు 40 శాతం మేరకు ఉన్నారు. ఈ పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణ తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో బాలలకు సంబంధించిన ఖర్చుల విశ్లేషణ చేసే బడ్జెట్ ఫర్ చిల్డ్రన్ (సీబీఎస్) విశ్లేషణ ప్రకారం గత పదేళ్లుగా కేటాయింపులు తగ్గడంతో బాలల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది.
ఆరోగ్య సంరక్షణ, విద్య, పిల్లల శ్రేయస్సును నిర్ధారించడానికి 'యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (యూఎన్సీఆర్సీ)ను మన దేశం మూడు దశాబ్దాల క్రితం ఆమోదించింది. పిల్లలపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంటున్నట్లు ఈ కన్వెన్షన్ పదేపదే చెబుతున్నప్పటికీ బడ్జెట్లపై ఎలాంటి ప్రభావం ఉండకపోవడం బాధాకరమైన విషయం. పిల్లల అభ్యున్నతి కోసం మంచి పథకాలు ప్రకటించినప్పటికీ, రాజకీయ కారణాలతో అవి పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. ఓటుహక్కు లేని పిల్లలపై బడ్జెట్ అంకెలు దోబూచులాడుతున్నాయి.
పిల్లలను రక్షించడం, హక్కులను కాపాడటం ప్రభుత్వాల కనీస బాధ్యతగా గుర్తించినప్పటికీ, ఇప్పటికీ బాల్య అభివృద్ధి ప్రాథమిక హక్కుగా మనుగడలో లేదు. 2023 ఏడాదికి వార్షిక విద్యా నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3-6ఏళ్ల మధ్య వయస్సు పిల్లల్లో 40 శాతం మేరకు ప్రీ స్కూల్ లేదా అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్నారు. పిల్లల ఎదుగుదల లోపం 35.5 శాతం ఉండగా, తక్కువ బరువుతో 19.3 శాతంగా ఉన్నారు. 2030 నాటికి యునైటెడ్ నేషన్స్ సూచించిన అభివృద్ధి లక్ష్యాలకు మన దేశం ఎంతగానో వెనకబడి ఉంది.
పిల్లల అవసరాలను తీర్చడంలో బడ్జెట్లు విఫలం
కేంద్ర ప్రభుత్వం 2008-– 09 ఆర్థిక సంవత్సరంలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కేంద్ర బడ్జెట్లో తొలిసారి బాలల బడ్జెట్ స్టేట్మెంట్ను ప్రవేశపెట్టింది. పిల్లల సంక్షేమానికి ప్రభుత్వ నిధులు కేటాయించడంతో తొలి అడుగు పడింది. అప్పటి నుంచీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లు పిల్లల అవసరాలను తీర్చడంలో విఫలమవుతున్నాయి. 2017-–18లో రూ.69,242 కోట్ల నుంచి 2024-–25లో 1,09,921కోట్లకు పెరిగినప్పటికీ, బడ్జెట్ అంచనాలు, మొత్తం కేంద్ర బడ్జెట్లో పిల్లలపై దృష్టి సారించిన వ్యయం వాటా తగ్గుతోంది. ఈ వాటా 2017-–18లో మొత్తం కేంద్ర వ్యయంలో 3.2 శాతం నుంచి 2019–-20లో 3 శాతానికి పడిపోయింది. 2024–-25లో 2.3 శాతానికి తగ్గింది.
వాస్తవానికి, ఈ కాలంలో పిల్లల కోసం అనేక కొత్త పథకాలు రావడం, కేటాయింపులలో తగ్గుతున్న ధోరణి జాతీయ ప్రణాళికలో పిల్లల అవసరాలకు ప్రాధాన్యత తగ్గడం ఆందోళనకు దారి తీస్తోంది. దీంతో విద్య, ఆరోగ్య, పోషకాహారం తదితర కీలక రంగాలపై ప్రభావం చూపుతోంది. కేటాయిస్తున్న నిధులలో అత్యధికంగా 75 శాతం మేరకు విద్యారంగానికి కేటాయిస్తుండడంతో ఆరోగ్యం, పోషకాహారం, రక్షణపరమైన రంగాలు దెబ్బతింటున్నాయి. ఇందువల్ల విద్య విస్తృత లక్ష్యం దెబ్బతింటోంది.
పోషకాహార లోపం
కేంద్ర బడ్జెట్ అంచనాలు 2026-–27లో పిల్లల కోసం కేటాయింపులు రూ.1,32,296.85 కోట్లుకాగా, 2025-–26లో అంచనాల మీద రూ. 16,164.35 కోట్లు అధికం. అంటే 2.29 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగింది. జీడీపీలో వాటా కూడా 0.33 నుంచి 0.34 శాతానికి స్వల్పంగా పెరిగింది. కానీ, దేశ వాస్తవ పరిస్థితులు, పెరుగుతున్న అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ బడ్జెట్ పరిమితంగానే ఉన్నట్లు భావించాలి. ఇది దేశ ఆర్థికవృద్ధి (8-9 శాతం)కి సరిపడా లేదు.
బడ్జెట్ కేటాయింపుల్లో స్త్రీ, శిశు అభివృద్ధి కింద మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య పథకాలకు 12, 6 శాతం ఉంది. పోషకాహారం, ఆరోగ్య రంగాలకు రూ.21,960 కోట్లు కేటాయించగా, విద్యారంగానికి ఏకంగా రూ.78,572 కోట్లు పొందుపరిచారు. పిల్లలు లోపపోషణ లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే విద్య అబ్బుతుందనే విషయాన్ని పాలకులు మరవడం ఒకింత బాధాకరం. ఆసేతు హిమాచలం అయిదేళ్లలోపు చిన్నారుల్లో 37శాతం మంది గిడసబారిపోయిన చేదునిజం మన కళ్లముందు మెదులుతుంది. దీంతో రకరకాల వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పిల్లలు 69 శాతం ఉంటున్నారు. ఇందుకు పోషకాహార లోపమే ప్రధాన కారణం.
పిల్లల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో 149 మిలియన్ల మంది ఎదుగుదల లోపాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పిల్లల స్థితిగతులలో, వారి ఆలోచనల్లో అనేక కొత్త మార్పులు, కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. వాతావరణంలో మార్పులు, పరిసరాలలో మార్పులు, వలసలు, సంఘర్షణలు, యుద్ధాలు, నిరాదరణ-, అన్యాయాలు, కుటుంబ కలహాలు, పేద, గొప్ప తారతమ్యాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అనేక సమస్యలతో దేశవ్యాప్తంగా పిల్లలు సతమతమవుతున్నారు.
ఈ సమస్యలను ఎదుర్కొనడంలోను, పరిష్కారం పొందడంలో పోషణ, ఆరోగ్యం, విద్యారంగాలు సరైన మార్గదర్శనం చేస్తాయి. కొత్త కొత్త సమస్యలతో బాలల హక్కులకు విఘాతం ఏర్పడుతున్న క్రమంలో కొత్త మార్గాలను అన్వేషించడంలో భాగంగా పిల్లల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. సమగ్ర, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే, ప్రతి ఏటా స్వల్ప పెరుగుదలకే పరిమితం కాకుండా, పిల్లలకు మరింత ప్రాధానత్యనిస్తూ బలీయమైన పెట్టుబడులపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
- కోడం పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు
