ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో జీవితఖైదు సెక్షన్లు

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో జీవితఖైదు సెక్షన్లు
  • ఐటీ యాక్ట్‌‌ 66 ఎఫ్‌‌ చేర్చేందుకు రంగం సిద్ధం
  • నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు
  • నేరం రుజువైతే జీవితకాలం జైలుశిక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌  రూం ధ్వంసం, ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌  కేసు కీలక మలుపు తిరుగుతున్నది. అనుమతులు లేకుండా విదేశాల నుంచి సాఫ్ట్‌‌‌‌వేర్లు కొనుగోలు చేసినందుకు సైబర్  టెర్రరిజం కింద పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఐటీ యాక్ట్‌‌‌‌లోని సైబర్  టెర్రరిజం సెక్షన్‌‌‌‌ 66 ఎఫ్‌‌‌‌ కింద విచారణ జరపనున్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ఐటీ యాక్ట్‌‌‌‌ సెక్షన్లతో పాటు సైబర్  టెర్రరిజం సెక్షన్‌‌‌‌ 66 ఎఫ్‌‌‌‌ను కూడా చేర్చాలని కోరారు.

దేశ భద్రతకు ముప్పువాటిల్లే విధంగా సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తే  ఈ సెక్షన్ యాక్ట్‌‌‌‌  కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్‌‌‌‌ 70 ప్రకారం 10 సంవత్సరాల జైలుశిక్ష ఉంది. దీంతో ఈ కేసులో నిందితులైన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌‌‌‌ రావుకు బెయిల్ లభించడం లేదు. ఈ క్రమంలోనే 66 ఎఫ్‌‌‌‌ ఐటీ యాక్ట్‌‌‌‌  చేరిస్తే నేరం రుజువైన వారికి ఈ సెక్షన్ కింద  జీవితఖైదు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు అధికారులు కోర్టుకు అందించాల్సి ఉంది. పోలీసులు దాఖలు చేసిన మెమోపై విచారణ అనంతరం కోర్టు తీర్పు వెల్లడించనుంది.

నిందితుల బెయిల్‌‌‌‌  పిటిషన్స్‌‌‌‌పై నేడు తీర్పు

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్  అయిన ప్రణీత్‌‌‌‌ రావు, భుజంగ రావు,తిరుపతన్న, రాధాకిషన్‌‌‌‌ రావు దాఖలు చేసుకున్న బెయిల్  పిటిషన్లపై శుక్రవారం తీర్పు వెలువడనుంది. నలుగురికి పోలీసు కస్టడీ ముగిసినందున బెయిల్  మంజూరు చేయాలని డిఫెన్స్  తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్‌‌‌‌  ఇవ్వవద్దని పోలీసుల తరపున పబ్లిక్  ప్రాసిక్యూటర్  కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో జడ్జి తన తీర్పును రిజర్వ్‌‌‌‌  చేశారు.