- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
లక్నో: అత్యాచారం కేసులో జైలుకెళ్లిన ఓ యువ నేత బెయిల్ పై బయటకు రావడంతో ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు.. పూల దండలు వేసి, భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ఏదో ఘనకార్యం సాధించిన వీరుడిలా స్వాగతం పలకడమేంటని జనం మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిందూ యువవాహిని మాజీ సభ్యుడైన సుశీల్ ప్రజాపతి.. ఓ లా విద్యార్థినికి లాయర్‌ను పరిచయం చేస్తానని చెప్పి ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత విద్యార్థిని ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రజాపతిని జైలుకు పంపారు. ఈ కేసులో తొమ్మిది నెలలుగా జైల్లో ఉన్న నిందితుడు.. మే 17న ఘజియాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. నిందితుడు జైలు బయటకు రాగానే.. అక్కడ వేచి ఉన్న అతడి అనుచరులు, మద్దతుదారులు తెల్లటి దుస్తుల్లో ఉన్న అతడికి బంతిపూల దండలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.
నిందితుడిని భుజాలపైకి ఎత్తుకుని జైత్రయాత్ర తరహాలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగించారు. ఈ సందర్భంగా మద్దతుదారులు నవ్వుతూ ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ గెలుపు సూచికగా 'విక్టరీ' సింబల్ చూపించడం గమనార్హం. ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ కావడంతో పోలీసుల దర్యాప్తు..
అత్యాచార నిందితుడికి పూలదండలు వేసి ఊరేగింపు నిర్వహించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందిస్తూ వైరల్ వీడియోలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
