50 ఏళ్లు దాటిన వీఆర్వోలకు వీఆర్ఎస్!

50 ఏళ్లు దాటిన వీఆర్వోలకు వీఆర్ఎస్!
  • 50 ఏళ్లు దాటిన వారికి స్కీమ్ అమలు
  • మిగతా వారికి ఇతర శాఖల్లో పోస్టింగ్స్
  • నేడు అసెంబ్లీ ముందుకు వీఆర్వో రద్దు బిల్లు
  • అయోమయంలో 5 వేల మంది ఎంప్లాయీస్

హైదరాబాద్, వెలుగుఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఎంప్లాయీస్​ను అయోమయంలో పడేసిన ప్రభుత్వం.. వీఆర్​ఎస్​ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) పేరుతో అందులో దాదాపు సగం మందిని ఇంటికి పంపేందుకు స్కెచ్​చేసింది. అసెంబ్లీలో  బుధవారం ప్రవేశ పెట్టే వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు- 2020లో ఇందుకు సంబంధించిన వివరాలుండే అవకాశముంది. వీఆర్వోలను ఏం చేయనున్నారు? వారిని ఏ శాఖలకు, ఎంత మందిని ట్రాన్స్​ఫర్ చేస్తారు?  మిగిలిన వారిని ఏం చేస్తారు? అనే వివరాలు బిల్లులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త చట్టం అమలుకు ముందు వీఆర్వోలను తొలగించాలని భావించిన ప్రభుత్వం రెండు రోజుల క్రితం వారి నుంచి రెవెన్యూ రికార్డును స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించింది. దీంతో మొత్తం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల వద్ద ఉన్న రికార్డులు ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీస్​లలో ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 5,088  మంది వీఆర్వోలున్నారు. వీరిలో సగం మందిని ఇంటికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం స్వచ్ఛంద పదవి విరమణ స్కీంను ఆఫర్ చేయాలనే ఆలోచిస్తోంది. 50  ఏళ్లు దాటిన వారికి స్కీమ్​ను అమలు చేయాలని కసరత్తు చేస్తోంది. మిగతా వారిని ఇతర శాఖాల్లో విలీనం చేసేందుకు సిద్ధమైందని సమాచారం.  పంచాయతీరాజ్​ శాఖలో సుమారు వెయ్యి మందిని అడ్జెస్ట్ చేసే అవకాశముంది. కొంత మందిని ఇరిగేషన్ శాఖలోకి బదిలీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది.