కొడుకును కూతురిలా రెడీ చేసి చూసుకుని.. కుటుంబం మొత్తం వాటర్ ట్యాంక్లో శవాలై..

కొడుకును కూతురిలా రెడీ చేసి చూసుకుని.. కుటుంబం మొత్తం వాటర్ ట్యాంక్లో శవాలై..

ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటన ఈ సంగతి తెలిసిన వారి హృదయాలను కలచివేసింది. ఎనిమిదేళ్ల కొడుకును తన తల్లి కవిత అందంగా అలంకరించి.. ఆడపిల్లలా తయారుచేసి.. తన బంగారం మొత్తం కొడుకుకు వేసి.. కొడుకు కళ్లకు కాటుక పెట్టి.. ఒక అందమైన కుందనపు బొమ్మలా కొడుకులో కూతురిని చూసుకుంది. ఏం జరిగిందో తెలియదు.. ఆ భార్యాభర్త చివరి కోరిక ఇదే కాబోలు.. ఆ తర్వాత ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.

బర్మార్: రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వారి మృతదేహాలు వాటర్ ట్యాంక్లో దొరికాయి. శివ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండు అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. సామూహిక ఆత్మహత్యగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం వాటర్ ట్యాంక్ నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వ్యక్తులను శివ్ లాల్ మేఘ్వాల్ (35), ఆయన భార్య కవిత (32), భజ్రంగ్ (9), రాందేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. ఇంటికి సుమారు 20 మీటర్ల దూరంలో వాటర్ ట్యాంక్లో ఈ మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

ఇద్దరు పిల్లలను చంపి వాటర్ ట్యాంక్ లో పడేసి.. భార్యాభర్త కూడా వాటర్ ట్యాంక్ లో దూకి చనిపోవాల్సినంత ఇబ్బందులేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శివ్ లాల్ తమ్ముడు తన అన్నయ్యకు ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పొరుగున ఉండే ఒకరిని శివ్ లాల్ ఇంటికి పంపించాడు. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు శివ్ లాల్ ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. జూన్ 29న ఈ లెటర్ రాసినట్టు ఉంది. తమ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయానికి ముగ్గురు కారణం అని.. ఆ ముగ్గురి పేర్లను శివ్ లాల్ రాసుకొచ్చాడు. ఈ ముగ్గురిలో శివ్ లాల్ తమ్ముడి పేరు కూడా ఉండటం గమనార్హం.

►ALSO READ | నిరుద్యోగి క్రూరత్వం: అసూయతో ఆమెని చంపి, 2 రోజులు శవం పక్కనే..

శివ్ లాల్ మామయ్య ఈ ఘటనపై స్పందిస్తూ.. శివ్ లాల్ కు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైందని.. కొత్త ఇల్లు కట్టుకోవాలని శివ్ లాల్ ఆశపడ్డాడని చెప్పాడు. అయితే.. శివ్ లాల్ కొత్త ఇల్లు కట్టుకునేందుకు అతని తల్లి, తమ్ముడు ఒప్పుకోలేదని.. ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు. ఈ గొడవల కారణంగానే.. తన తల్లి, తమ్ముడు పెట్టిన మానసిక హింస భరించలేక శివ్ లాల్ తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని శివ్ లాల్ మామయ్య చెప్పాడు. ఈ ఘటన  జరిగిన రోజు శివ్ లాల్ కుటుంబం ఇంట్లోనే లేరని.. శివ్ లాల్ తల్లి తన సోదరుడిని చూడటానికి బర్మార్ కు వెళ్లిందని, శివ్ లాల్ తండ్రి ఒక ఫంక్షన్ కు వెళ్లాడని చెప్పాడు.