గాంధీ నగర్: గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చడమే లక్ష్యంగా గుజరాత్ రాష్ట్రం డాంగ్ జిల్లాలోని గరుడియా గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో మద్యం సేవించిన, విక్రయించిన భారీగా జరిమానాలు విధించాలని తీర్మానించింది. గ్రామంలో ఎవరైనా మద్యం సేవిస్తే రూ.25 వేలు, మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా విధించనున్నారు. గ్రామస్తుల్లో మద్యపాన అలవాటును మాన్పించి వారి ఆరోగ్యం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని గ్రామ పంచాయతీ స్పష్టం చేసింది. గరుడియా గ్రామంలో దాదాపు 1500 మంది జనాభా ఉన్నారు.
ఈ మేరకు సర్పంచ్ కె.ఎం. కామ్రి గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో మద్యం అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి పంచాయతీ సభ్యులందరూ భేషరతుగా మద్దతు తెలిపారు. గ్రామంలో మద్యం సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సర్పంచ్ ఐదుగురు సభ్యులతో కూడిన దేఖ్ రేఖ్ (పర్యవేక్షణ) కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గ్రామంలో మద్యం సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించి గ్రామ పంచాయతీకి సమాచారం అందించనుంది.
ఈ తీర్మానం ప్రకారం.. గ్రామంలో ఎవరైనా మద్యం సేవించి పట్టుబడితే రూ.25,000 జరిమానా విధించనున్నారు. ఇక, గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే వారికి రూ.51 వేల భారీ ఫైన్ వేస్తారు. గ్రామంలో ఎవరైనా మద్యం తాగుతున్నట్లు లేదా అమ్ముతున్నట్లు సమాచారం అందించిన వారికి గ్రామ పంచాయతీ రూ. 5 వేల బహుమతి అందించనుంది. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారు.
మద్యం సేవిస్తూ లేదా అమ్ముతూ ఒకసారి పట్టుబడిన తర్వాత కూడా ఎవరైనా మళ్లీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే వారి కుటుంబాన్ని గ్రామంలోని సామాజిక కార్యక్రమాలకు, ఇతర మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. అటువంటి కుటుంబం నిర్వహించే ఏ కార్యక్రమాలలోనూ గ్రామంలోని ఒక్క సభ్యుడు కూడా పాల్గొనడు
