చాయ్ కి కేరాఫ్ 'చాయ్ మినార్'

చాయ్ కి కేరాఫ్ 'చాయ్ మినార్'

చాయ్ కి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఆ బ్రాండ్ నే పేరుగా పెట్టి ఓ యువ పారిశ్రామికవేత్త హైదరాబాద్ లో ఐకానిక్ చార్మినార్ తరహాలో ఓ కేఫ్ ను ఓపెన్ చేశాడు. దీనికి 'చాయ్ మినార్' అని పేరు పెట్టాడు. హిస్టారికల్ నమూనాను పోలి ఉన్న ఈ కేఫ్ అనేక రకాల చాయ్ లను అందిస్తోంది. ఇక్కడ జింజర్ షాట్ అనే టీ రకానికి అత్యంత డిమాండ్ ఉంటుంది.

ఒకప్పుడు డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ కు వచ్చానని చాయ్ మినార్ కేఫ్ యజమాని విజయ్ రాఘవేంద్ర తెలిపారు. తనకు చిన్నప్పట్నుంచి చరిత్ర చదవడమంటే ఇష్టమని, గ్రాడ్యుయేషన్ రోజుల్లో సెంట్రల్ లైబ్రెరీ దగ్గరే ఉండేవాడినని, కాలేజీ కంటే లైబ్రెరీకే ఎక్కువగా వెళ్లేవాడినని ఆయన చెప్పారు. అక్కడే చాలా కాలం హిస్టరీ బుక్స్ చదువుతూ గడిపేవాడినన్నారు. ఆ సమయంలోనే తాను చాలా దూరం నుంచి చార్మినార్ ను చూసి ఇష్టపడ్డానని విజయ్ తెలిపారు. కానీ తాను సందర్శించలేదన్నారు.

ఓ సారి తన స్నేహితులు చార్మినార్ ను సందర్శించి వచ్చారని, వాళ్లు చెప్పిన దాని ప్రకారం అది దూరం నుంచి చూసేంత అందంగా కనిపించదు. ఒకవేళ చూసిన తర్వాత తనక్కూడా అదే భావన కలుగుతుందేమోనని, తనకున్న మంచి ఫీలింగ్ ను అది నాశనం చేస్తుందని వెళ్లలేదని విజయ్ చెప్పారు. ఆ తర్వాత తాను వ్యాపారంలోకి ప్రవేశించడానికి దాదాపు 7నెలల సమయం పట్టిందన్నారు. అందులో రెండు నెలల పాటు వివిధ వంటకాలపై పనిచేశానన్న ాయన.. కేఫ్ ను నిర్మించే పనిలో ఉన్న కాంట్రాక్టర్ ప్రాజెక్టును సగంలోనే వదిలేశాడని, దాన్ని పూర్తి చేయడానికి తన వద్ద లేదని చెప్పారు. కానీ అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విజయ్.. దాన్ని ఎలాగైనా నిర్మించాలని నిశ్చయించుకున్నారని, వెదురు, ఇతర సామాగ్రి తెచ్చి అందులో ఫర్నీచర్ సహా అన్నీ తానే ఏర్పాటు చేశానని చెప్పారు.

ఇప్పుడు తన దుకాణానికి 400 నుంచి 500మంది కస్టమర్లు వస్తూ ఉంటారని విజయ్ తెలిపారు. తమ వద్ద జింజర్ టీ, ఇలాచీ టీ లాంటి ఇతర పాలతో చేసిన టీలు అందుబాటులో ఉంటాయన్నారు, అంతే కాదు మందార, గులాబీ రేకులు, చామంతి వంటి ప్లవర్ బ్రూడ్ టీలు కూడా తమ వద్ద లభిస్తాయని చెప్పారు. వీటిలో ఔషధ గుణాలుంటాయన్న ఆయన.. ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. తమ ఉన్న టీలలో జింజర్ షాట్ కు అత్యంత డిమాండ్ ఉంటుందని విజయ్ చెప్పారు.

చాయ్ మినార్ అనేది ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ లా మారిందని విజయ్ అన్నారు. కాఫీకి బ్రాండ్ ఉన్నట్టే.. టీకి కూడా తాను ఓ బ్రాండ్ ను సృష్టించాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. కేఫ్ ప్రారంభించిన నాలుగు  నెలల్లోనే తన కేఫ్ కు మంచి స్పందన వచ్చిందన్న విజయ్... ఇప్పటికే ఈ కేఫ్ కోసం ట్రేడ్ మార్క్ లు, డిజైన్ పేటెంట్ లను కలిగి ఉన్నట్టు స్పష్టం చేశారు. తన చాయ్ మినార్ ను దేశమంతటా విస్తరించాలనకుంటున్నానని ఆయన ప్రకటించారు.

స్నేహితులతో గడిపేందుకు ఈ కేఫ్ చాలా చక్కని ప్రదేశం అని, తాము రెగ్యులర్ వస్తూ ఉంటామని కొంతమంది కస్టమర్లు చెబుతున్నారు. ఇక్కడ టీ రుచిగా ఉంటుందని, వాతావరణం బాగుంటుందని అంటున్నారు.