కారు సీట్లలో కేన్సర్ కెమికల్స్

కారు సీట్లలో కేన్సర్ కెమికల్స్

రోజూ గంటల తరబడి కార్లలో ప్రయాణం చేసేటోళ్లకు కేన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువైతాయట. కార్ల సీట్ల నుంచి విడుదలయ్యే కెమికల్సే అందుకు కారణమట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా, డ్యూక్ యూనివర్సిటీ రీసెర్చర్ల స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మామూలుగా బయటి నుంచి వచ్చే దుమ్ము, ధూళి, విష వాయువులు, కెమికల్స్ వంటి వాటితో కార్లలో ఉన్నవారికి పొల్యూషన్ ప్రమాదం ఉంటుంది. అందుకే లోపలికి వచ్చే గాలిని ఫిల్టర్ చేసేందుకు కొన్ని కంపెనీలు తమ కార్లలో ఏర్పాట్లు కూడా చేశాయి. కానీ కార్ల లోపల నుంచి కూడా పొల్యూషన్ ముప్పు ఉందని అమెరికా రీసెర్చర్లు వెల్లడించారు.

కెమికల్ సంగతి ఇలా తెలిసింది..

రీసెర్చ్​లో 90 మంది స్టూడెంట్లు వలంటీర్లుగా పాల్గొన్నారు. వీళ్లందరూ ఐదు రోజుల పాటు కంటిన్యూగా సిలికాన్ రిస్ట్ బ్యాండ్స్ కట్టుకున్నారు. రోజూ15 నిమిషాల నుంచి 2 గంటల వరకూ కార్లలో ప్రయాణించారు. ఈ ఐదు రోజుల పాటు వారి చేతికున్న సిలికాన్ బ్యాండ్స్ పీల్చుకున్న గాలిలోని కెమికల్స్ ను పరిశీలించారు. దీంతో టీడీసీఐపీపీ కెమికల్ ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు తేలింది. కొందరి మూత్ర పరీక్షల్లోనూ ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ కెమికల్ సీట్లలో ఎక్కువ కాలం ఉండదని, కాలం గడుస్తున్న కొద్దీ సీట్ల నుంచి గాలిలో కలుస్తూ ఉంటుందని అంటున్నారు. దీనితో పాటు ఆర్గానోఫాస్పేట్ రకం కెమికల్స్ ఆనవాళ్లు కూడా దొరికినా, అవి తక్కువ స్థాయిలోనే ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ వోల్జ్ వెల్లడించారు. ఇప్పటివరకూ బయటి నుంచి వచ్చే ఎయిర్ పొల్యూటెంట్లపైనే ఆటోమొబైల్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయని, లోపలి పొల్యూషన్ పై ఫోకస్ పెట్టడం లేదన్నారు.

ఏమిటీ కెమికల్?

కార్లలో మంటలు అంటుకుంటే సీట్లు త్వరగా కాలిపోకుండా అడ్డుకునేందుకని  ‘క్లోరినేటెడ్ ట్రిస్ (టీడీసీఐపీపీ)’ అనే ‘ఫ్లేమ్ రిటార్డెంట్’ కెమికల్​ను ఉపయోగిస్తున్నారట. అయితే సీట్ల నుంచి ఈ కెమికల్ తరచూ విడుదలై గాలిలో కలుస్తుందని, కార్లలో ఉన్నోళ్లు గాలిని పీల్చుకున్నప్పుడు ఇది వారి శరీరంలోకి పోతోందని గుర్తించారు. కాలిఫోర్నియా స్టేట్ ప్రభుత్వం సేఫ్  డ్రింకింగ్ వాటర్ అండ్ టాక్సిక్ ఎన్ఫోర్స్​మెంట్ యాక్ట్ ప్రకారం, ప్రపోజిషన్ (హాని కలిగించే కెమికల్స్ ప్రతిపాదన) 65 లిస్ట్​ను విడుదల చేస్తుంది. ఇందులో టీడీసీఐపీపీ కెమికల్​ను ఎక్కువ రోజులు పీల్చుకుంటే కేన్సర్​ బారిన పడే ప్రమాదముందని హెచ్చరించింది. దీనిని2013 నాటి లిస్టులోనే చేర్చారని, చాలా విధాలుగా దీని వాడకం ఆగిపోయిందని రీసెర్చర్లు తెలిపారు. కానీ కార్ల సీట్ ఫోమ్​లో మాత్రం యథేచ్ఛగా వాడేస్తున్నారని గుర్తించారు. కనీసం వారం రోజులు వరుసగా కార్లలో ప్రయాణిస్తే ఈ కెమికల్ ను హానికర స్థాయిలో పీల్చుకునే ప్రమాదం ఉందంటున్నారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం