మురికివాడల్లో తిరిగితే ఎన్నో తెలుస్తయ్‌‌‌‌

మురికివాడల్లో తిరిగితే ఎన్నో తెలుస్తయ్‌‌‌‌
  • వాటిని బాగుచేసే దారులు వెతకండి: సీజేఐ ఎన్వీ రమణ

హైదరాబాద్, వెలుగు: ‘ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండానే కాలం గడిపే రోజులు వచ్చినయ్. కానీ కొంచెం టైమ్ తీసుకుని బయటకు వెళ్లి చూడండి. మీ సిటీలో, మీ ఊరిలో ఎన్నో సమస్యలు ఉన్నయ్. వాటి గురించి అడిగి తెలుసుకోండి. వాటిని ఎట్ల పరిష్కరించాల్నో ఆలోచించండి’ అని యువతకు సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామకృష్ణమఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 22వ వార్షికోత్సవం, చికాగోలో వివేకానంద ప్రసంగించి 128 ఏండ్లయిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, రాజకీయాలను స్టూడెంట్లు తప్పకుండా తెలుసుకోవాలె అని చెప్పారు. మీ ఆరోగ్యంతో పాటు, సమాజం గురించి కూడా కేర్​ తీసుకోవాలని చెప్పారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. ‘‘దేశంలో వస్తున్న ప్రతి మార్పు వెనక యువత ఉంది. ఆదర్శవంతమైన దేశాన్ని, సమాజాన్ని మీ కోసం నిర్మించుకోండి” అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
వివేకానంద బోధనలను..
స్వామి వివేకానంద బోధనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, వాటిని పాటించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘మన జనాభాలో యువతే ఎక్కువ. దేశ భవిష్యత్తు ను తీర్చిదిద్దే బాధ్యత వారి భుజాలపైనే ఉంది” అని చెప్పారు. 1893 చికాగో మత సమ్మేళనంలో వివేకానంద పాల్గొనడంతో మన దేశానికి గౌరవప్రదమైన గుర్తింపు వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆయన ప్రసంగం మన దేశ ఫిలాసఫీ వేదాంతపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ప్రపంచ శాంతి, ప్రేమ, అందరినీ గౌరవించడం తదితర అంశాలను బోధించారని గుర్తు చేశారు.