ఇద్దరు ఫారెస్ట్ అధికారులను తొక్కి చంపిన ఏనుగు

ఇద్దరు ఫారెస్ట్ అధికారులను తొక్కి చంపిన ఏనుగు

వేసవికాలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు.. దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి.  ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ అడవి ఏనుగు దాడిలో ఇద్దరు ఫారెస్టు అధికారులతోపాటు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందారు.  ఈఘటన అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఏప్రిల్ 27వ తేదీ శనివారం చోటుచేసుకుంది.

 ధేకియాజులి అటవీ ప్రాంతం సమీపంలోని ధీరాయ్ మజులి గ్రామంలోకి వచ్చిన ఏనుగు.. ఆ ప్రాంతంలో  పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్టు అధికారులపై దాడి చేసిందని.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఫారెస్ట్ అధికారి గాయపడినట్లు వెస్ట్ తేజ్‌పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నిపెన్ కలితా తెలిపారు.

మృతులను ఫారెస్ట్ గార్డులు కోలేశ్వర్ బోరో, బీరెన్ రావా, స్థానిక వ్యక్తి జతిన్ తంతిగా గుర్తించామని చెప్పారు. గాయపడిన వ్యక్తి దిబాకర్ మలాకర్‌ను ఆసుపత్రిలో చేర్చామని, అతని పరిస్థితి విషమంగా ఉందని ఫారెస్టు అధికారి తెలిపారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.