
తెలంగాణకు మూడు రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆగస్టు 18న మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భద్రాద్రి, మహబూబాబాద్ ,ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్జ్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ వేగంతో) అన్ని జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
సిద్దిపేటలో భారీ వర్షం
ఆగస్టు 17న సిద్దిపేట జిల్లాలోని గౌరారంలో రికార్డ్ స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిద్దిపేటలోని ములుగులో 18.65 సెం.మీ మెదక్ లోని ఇస్లాంపూర్ లో 17.95, కామారెడ్డిలోని పిట్లం లో 17.5 , యాదాద్రి భువనగిరి లోని అడ్డగూడూరు లో 16.48 సంగారెడ్డిలోని కంగ్టి లో 16.9 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి 16.4 , కామారెడ్డి 16 నిజామాబాద్ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా 29 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లోని హైదర్ నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మల్కాజిగిరిలో 4.4, కూకట్ పల్లి 4.3 కాప్రా శేర్లింగంపల్లి 4.2 , కుత్బుల్లాపూర్, అల్వాల్,బీహెచ్ఇఎల్ , రామచంద్రపురం 4 సెం.మీ. నేరేడె మెట్, ఉప్పల్ మల్లాపూర్ గాజులరామారం, లింగంపల్లి, మౌలాలి , ముషీరాబాద్ ,సఫిల్గుడా షేక్ పేట,బంజారా హిల్స్ పటాన్ చెరు, చందానగర్, ఖైరతాబాద్ బోరబండ మూడు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది.