ఆరేండ్లుగా కాలువకు రిపేర్లు చేయరా? : మంత్రి జూపల్లి 

ఆరేండ్లుగా కాలువకు రిపేర్లు చేయరా? : మంత్రి జూపల్లి 
  • ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై మంత్రి జూపల్లి ఆగ్రహం

వనపర్తి/వీపనగండ్ల , వెలుగు :  కొల్లాపూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం  వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో తెగిపోయిన భీమా ప్రధాన కాలువను మంత్రి పరిశీలించారు. అనంతరం వనపర్తి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఇరిగేషన్, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. భీమా ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పనుల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని వెంటనే సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

2019లో కాలువ తెగిపోయి ఆరేండ్లు గడుస్తున్నా, ఇప్పటికీ రిపేర్లు చేపట్టకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో నీరు అందక రైతులు నష్టపోతుంటే, కాగితాల్లో మాత్రం సాగునీరు అందుతున్నట్లు తప్పుడు నివేదికలు పంపడంపై ధ్వజమెత్తారు. ఈపీసీ ఒప్పందం ప్రకారం పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకు కాలువ గండిని పూడ్చే బాధ్యత పూర్తిగా కాంట్రాక్టరుదేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.