Rohit Sharma: కుర్రాళ్లు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. భవిష్యత్లో ఆధిపత్యం భారత్దే!

Rohit Sharma: కుర్రాళ్లు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. భవిష్యత్లో ఆధిపత్యం భారత్దే!

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ) టోర్నమెంట్లలో ఇటీవల భారత పురుష, మహిళా టీమ్స్ అద్భుతాలు చేస్తున్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ లను కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి మహిళా వన్డే ప్రపంచ కప్ ని దక్కించుకుంది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఆధిపత్యానికి ఇది ఆరంభం మాత్రమేనని.. ముందు ముందూ ఇది మరింతగా కొనసాగుతుందని మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ పేర్కొన్నారు. 

టీమిండియా గత కొంతకాలంగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. జాతీయ పతాకం రెపరెపలాడుతుంది.. భవిష్యత్తులో కూడా ఇదే దూకుడు ప్రదర్శన కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను.. మెన్స్ టీమ్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ లని గెలవడం గర్వంగా ఉందన్నారు. అయితే, ఉమెన్స్ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.. తొలిసారి వన్డే ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది.. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ని చూడటం చాలా బాగుందని ప్రసంశించాడు. కానీ ఇది ఆరంభం మాత్రమే.. ఒక్కసారి ఇలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత.. ముందుకు కొనసాగాల్సిందే.. అందరిపై బాధ్యత మరింత పెరుగుతుందని రోహిత్ వెల్లడించాడు. 

అలాగే, ఎప్పుడు ఛాన్స్ వచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కుర్రాళ్లు సిద్ధంగా ఉండాలని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సూచించాడు. ప్రతి సవాల్ ని స్వీకరిస్తూ.. అందుకోసం సన్నద్ధ కావడమే కీలకం.. జాతీయ జట్టుకు ఎవరినైనా ఎంపిక చేశారంటే దానికి కారణం ఉంటుంది.. ఇండియాలో చాలా పోటీ ఉంటుంది.. అండర్-14 నుంచే ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా సరే కాస్త అదృష్టం కలిసిరావాల్సిందే.. సరైన సమయంలో మనలోని ప్లేయర్ ని గుర్తించే వ్యక్తి తారసపడాలి అన్నారు. మీ దగ్గర మంచి నైపుణ్యం ఉన్నా సరే ఎవరికీ చూసే ఛాన్స్ రాకపోతే వృథానే.. లక్ ఉండటంతో పాటు ప్రతీరోజు శ్రమించడం అంతకంటే ముఖ్యమని తెలిపారు. కేవలం ముంబై క్రికెటర్లకు మాత్రమే కాదు.. నేషనల్ టీమ్ కి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని రోహిత్ శర్మ తెలియజేశాడు.