అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పుదు: ఓట్ చోరీ ఇష్యూపై రాహుల్ గాంధీ శపథం

అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పుదు: ఓట్ చోరీ ఇష్యూపై రాహుల్ గాంధీ శపథం

పాట్నా: ఓట్ చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీకి పాల్పడుతోన్న వారికి శిక్ష తప్పదని.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ "ఓటరు అధికార్ యాత్ర" చేపట్టిన విషయం తెలిసిందే. 

ఈ ర్యాలీలో భాగంగా సోమవారం (ఆగస్ట్ 18) బీహార్‎లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని శపథం చేశారు. బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ల దొంగతనానికి దోహదపడేలా రూపొందించబడిందని ఆరోపించారు.

ఈసీ బీజేపీకి బీ టీంగా మారి ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బీహార్లో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కొత్త రకమైన ఓటు దొంగతనం తప్ప మరొకటి కాదని, ఇది బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ అని ఎద్దేవా చేశారు. మాకు కొంత సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానంలో మీ దొంగతనాన్ని పట్టుకుని ప్రజల ముందు ఉంచుతామని ఈసీని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్లు కేవలం బీజేపీ కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా అధికారంలోకి వచ్చాక భారత పౌరుల ఓట్ల చోరీకి పాల్పడిన ఎన్నికల కమిషనర్లను జవాబుదారీగా ఉంచుతామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.