గ్రేటర్ వరంగల్‍ చుట్టూ నేషనల్ హైవేలు

గ్రేటర్ వరంగల్‍ చుట్టూ నేషనల్ హైవేలు
  • 4 లైన్ల రోడ్డుగా మారనున్న వరంగల్‍ _ఖమ్మం ఎన్‍హెచ్‍ 563
  • మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​కు వెళ్లేందుకు నయా రోడ్‍
  • ఇప్పటికే వరంగల్‍_హైదరాబాద్‍, కరీంనగర్ నేష్నల్​హైవేలు 
  • వరంగల్‍ మీదుగానే నాగపూర్‍ ‌_విజయవాడ ‘గ్రీన్‍ఫీల్డ్’​

వరంగల్‍, వెలుగు: గ్రేటర్​వరంగల్​ సిటీ చుట్టూరా నేషనల్‍ హైవేలు తళుక్కుమంటున్నాయి. డబుల్‍ రోడ్లుగా ఉన్న నేషనల్‍ హైవేలు నాలుగు లేన్​రోడ్లుగా మారుతున్నాయి. ఇప్పటికే వరంగల్‍ – హైదరాబాద్‍ వెళ్లే హైవే 6 లైన్లుగా మారగా, త్వరలోనే వరంగల్‍– కరీంనగర్‍ 4 లైన్ల రోడ్డు అందుబాటులోకి రానుంది. లెటెస్ట్​గా వరంగల్‍– ఖమ్మం నేషనల్‍ హైవేను సైతం 4 లైన్ల రోడ్డుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. వీటికితోడుగా నాగపూర్‍– విజయవాడ గ్రీన్‍ఫీల్డ్​ హైవే వరంగల్‍ మీదుగానే వెళ్తుండటంతో గ్రేటర్‍ వరంగల్‍  మీదుగా ఆయా రాష్ర్టాలకు వెహికల్స్​ వెళ్లనున్నాయి.

సిటీ మీదుగా ఎన్‍హెచ్‍_163, 563

హైదరాబాద్‍ నుంచి వరంగల్‍ వెళ్లే క్రమంలో ఇప్పటికే 6 లైన్ల నేషనల్‍ హైవే–163పై వాహనాలు దూసుకుపోతున్నాయి. గతంలో 202 జాతీయ రహదారిగా ఉన్న ఈ మార్గాన్ని 'భారత్‍ మాల' ప్రాజెక్టులో భాగంగా 474 కిలోమీటర్ల దూరం అభివృద్ధి చేశారు. చత్తీస్‍గఢ్​లోని భూపాలపట్నం నుంచి ప్రారంభమై వరంగల్‍ సిటీ, హైదరాబాద్‍, మొయినాబాద్‍, చేవెళ్ల, మన్నెగూడ మీదుగా కొడంగల్‍ ప్రాంతాన్ని కలుపుతోంది. వరంగల్‍ నుంచి హైదరాబాద్‍ వెళ్లాలన్నా, సమ్మక్కసారక్క మేడారం జాతర వెళ్లే లక్షలాది మంది భక్తులకు ఈ రోడ్డు ఉపయోగపడుతోంది.

వరంగల్‍ సిటీ నుంచి కరీంనగర్‍ జిల్లా వైపు  గతంలో రెండు లైన్ల నేషనల్‍ హైవే 563 అందుబాటులో ఉండగా, ఇప్పుడు దీనిని 4 లైన్లుగా మార్చుతున్నారు. రూ.2,146 కోట్లతో చేపట్టిన 248.83 కిలోమీటర్ల ఈ రహదారి జగిత్యాల, కరీంనగర్‍ మీదుగా వరంగల్‍ సిటీకి చేరి ఖమ్మం వైపు వెళ్లనుంది.

వరంగల్‍ మీదుగానే మహారాష్ట్ర, ఏపీలకు..

మహారాష్ట్రలోని నాగపూర్‍ నుంచి ఆంధ్రప్రదేశ్‍ లోని విజయవాడ వరకు నిర్మిస్తున్న గ్రీన్‍ఫీల్డ్​ హైవే వరంగల్‍ నగరాన్ని ఆనుకునే వెళ్తోంది. దాదాపు 405 కిలోమీటర్ల దూరం నిర్మించే 4 లైన్ల రహదారి ఎకనామిక్‍ కారిడార్‍గా మారనుంది. రూ.14,666 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్​వచ్చే ఏడాది పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి. ఈ నేషనల్‍ హైవే మహారాష్ట్ర నుంచి కుమరంభీం ఆసిఫాబాద్‍, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‍ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల నుంచి వరంగల్‍ నగరాన్ని ఆనుకునే మహబూబాబాద్‍, ఖమ్మం మీదుగా ఏపీలోని విజయవాడకు వెళ్తోంది.

4 లైన్ల వరంగల్‍– ఖమ్మం హైవేకు గ్రీన్‍సిగ్నల్‍

వరంగల్‍ సిటీ నుంచి ఖమ్మం వరకు నేషనల్‍ హైవే 563 డబుల్‍ రోడ్డు ఉండగా, దీనిని 4 లైన్ల రహదారిగా మార్చేందుకు ఇటీవల కేంద్రం నిర్ణయించింది. 119 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ఇప్పటికే రద్దీ పెరిగింది. కాగా, వరంగల్‍ నుంచి ఖమ్మం వెళ్లే రూట్‍లోనే మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‍ మరింత పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 15 హైవే ప్రాజెక్టులపై దృష్టి పెట్టగా, అందులో వరంగల్‍, ఖమ్మం హైవే రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చింది. దీనికి సంబంధించి డీపీఆర్‍ తయారీకి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కన్సల్టెన్సీ నియామకం కోసం టెండర్లను ఆహ్వానించింది. దీంతో వరంగల్‍ నుంచి మామునూర్‍, వర్ధన్నపేట, తొర్రూర్‍ మీదుగా ఖమ్మం వెళ్లే రహదారి పూర్తిస్థాయిలో వెడల్పు కాబోతుంది.