
హైదరాబాద్ కూకట్పల్లిలో పన్నెండేళ్ల బాలిక హత్య కలకలం రేపింది. ప్రపంచం అంటే కూడా తెలియని బాలికను హత్య చేసి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కొడుకుకు బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన తండ్రికి.. ఇంట్లో బెడ్డు మీద కత్తిపోట్లతో పడిఉన్న కూతురు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
కూకట్ పల్లి సంగీత్ నగర్ లో జరిగింది ఈ దారుణ ఘటన. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో సహస్ర (12) అనే బాలికను హత్య చేసి పారిపోయారు దుండగులు. ఇంట్లో చనిపోయి ఉన్న కూతురును చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు కూకట్ పల్లి పోలీసులు. ఘటన గురించి తెలిసుకున్న స్థానికులు బాలిక ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్. గత కొన్నాళ్లుగా కూకట్ పల్లిలో నివసిస్తున్నారు. ఎప్పట్లాగే తండ్రి మెకానిక్ షాపుకు, తల్లి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత జరిగింది ఈ ఘటన. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను చంపేశారు దుండగులు.
ALSO READ : రామంతాపూర్ ఘటన..న్యాయం చేయాలంటూ ఆందోళనలు..
బాలిక మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇంట్లో తాము లేని సమయంలో హత్య చేశారని రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.