టెర్రరిస్టులను మించిన క్రిమినల్స్ మన సమాజంలో, మనతోనే తిరుగుతున్నారు అనటానికి ఇది కరెక్ట్ ఉదాహరణ. రైలులో ఒక ప్రొఫెసర్ ను ఒక దుండగుడు చంపిన తీరు దేశం మొత్తాన్ని షాక్కు గురిచేస్తోంది. శనివారం (జనవరి 24) సాయంత్రం సరిగ్గా 6 గంటలకు జరిగిన ఈ దారుణ హత్య.. ముంబైకి నిద్రలేకుండా చేసింది. పసా పసా పొడిచేసి పారిపోయిన తీరును చూసి సాటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ భయంకర మర్డర్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంచలనం సృష్టించిన ముంబై రైలు హత్య కేసులో రైల్వే పోలీసులు ఓంకార్ షిండే (27) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైల్ పార్లే లోని కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అలోక్ సింగ్ ను మలాద్ స్టేషన్ లో 1,2 ప్లాట్ ఫామ్ ల మధ్య దారుణంగా పొడిచి పరిగెత్తాడు ఓంకార్ షిండే.
ఏంటి గొడవ..?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రైలులో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. మలాద్ స్టేషన్ చేరుకున్నాక.. రైలు దిగే క్రమంలో జరిగిన చిన్న గొడవలో.. అసహనంతో దాడికి దిగాడు షిండే. ఎవరు ముందు దిగాలనే విషయంలో వివాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. అత్యంత రద్దీగా ఉండే ముంబై రైళ్లలో ఇలాంటి గొడవలు తరచుగా జరుగుతూనే ఉంటాయి.
ఇద్దరి మధ్య మాటల యుద్ధం భయంకర దాడికి దారితీసింది. ప్లాట్ ఫామ్ మీదికి దిగిన వెంటనే.. కంట్రోల్ కోల్పోయిన షిండే.. పదునైన కత్తితే ప్రొఫెసర్ కడుపులో అత్యంత క్రూరంగా నాలుగైదు పోట్లు పొడిచాడు. రక్తపు మడుగులో ప్రొఫెసర్ గిలగిలా కొట్టుకుంటుండగా నిందితుడు గుంపులో తప్పించుకుని పారిపోయాడు. బాధిత ప్రొఫెసర్ ను స్థానిక బీఆర్ అంబేద్కర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.
12 గంటల్లో పట్టుకున్నారు..
బొరీవాలీ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) కేవలం 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా హంతకుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో ఉన్న వ్యక్తి.. ఫూట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి భయం భయంగా పరిగెడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. విజువల్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు.
ఎన్నో ప్రశ్నలు:
ప్రొఫెసర్ మర్డర్ వెనుక ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తున్నాయి. ఎవరు ముందు దిగాలనే చిన్న వాగ్వాదానికే ఒక వ్యక్తిని చంపుతారా..? లేదా ఇద్దరి మధ్య అంతకు ముందే ఏదైనా పగ, ప్రతీకారాలున్నాయా..? రైలులో ప్రయాణించే వ్యక్తి కత్తిని ఎందుకు తీసుకొస్తాడు..? లేక ప్రొఫెసర్ ను వేరెవరైనా చంపించారా..? ఇవి ఆ ఘటనపై వెల్లువెత్తిన ప్రశ్నలు. చంపిన తీరు చూస్తుంటే.. కచ్చితంగా చంపేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు తెలుస్తుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిజానిజాలను బయటకు తీస్తామని పోలీసులు తెలిపారు.
