
రైల్లో పెంపుడు కుక్కను కట్టేసి యజమాని గాయబ్ అయిపోయాడు. స్లీపర్ కోచ్లో శునకాన్ని కట్టేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆ కోచ్ ఎక్కేందుకే భయపడ్డారు. ఆ కుక్క మొరుగుతూ కరవడానికి వస్తుండటంతో దాని దగ్గరకు వెళ్లి కట్టేసిన ఆ చైన్ విప్పే ప్రయత్నం చేయడంలో ప్రయాణికులు విఫలమయ్యారు.
రైల్వే శాఖ జోక్యం చేసుకుని డాగ్ రెస్క్యూ టీంను పిలిపించి ఎట్టకేలకు ఆ కుక్కను ఆ రైలు నుంచి దించేశారు. దీంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి రైలు బయల్దేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యంగా బయల్దేరింది. ఉదయం 6 గంటల 50 నిమిషాలకు బయల్దేరాల్సిన రైలు 8 గంటల 10 నిమిషాలకు బయల్దేరింది. బీహార్లోని రక్షౌల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 55578 రక్షౌల్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటల 50 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది. కానీ.. ఒక కుక్క స్లీపర్ కోచ్లో కట్టేసిన స్థితిలో కనిపించింది. ఆ కుక్కను అక్కడ నుంచి పంపించేద్దామని కుక్క మెడలో గొలుసు తీయబోతే కరిచేంతలా మొరుగుతోంది. దగ్గరకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అరుస్తూ భయపెట్టడంతో ఎవరూ ఆ గొలుసును తొలగించే సాహసం చేయలేకపోయారు.
ఆ పెట్ డాగ్ ఓనర్ ఎవరో వస్తారని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. ఏ కారణాలతో ఆ కుక్కను వదిలేసి వెళ్లిపోయారో తెలియదు. వదిలించుకున్నారో కూడా తెలియదు. వందల మంది ప్రయాణం చేసే రైలులో వదిలేసి వెళ్లిపోయారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. రైలు గంటకు పైగా ఆలస్యం కావడానికి కారణమైన ఆ పెట్ డాగ్ ఓనర్పై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.