బిగ్ బాష్ లీగ్ 2025-26 నుంచి అశ్విన్ ఔట్.. చివరి క్షణంలో ఏమైందంటే..?

బిగ్ బాష్ లీగ్ 2025-26 నుంచి అశ్విన్ ఔట్.. చివరి క్షణంలో ఏమైందంటే..?

చెన్నై: బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 ఎడిషన్ నుంచి భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా బీబీఎల్ నుంచి  వైదొలుగుతున్నట్లు ఈ మేరకు అశ్విన్ ప్రకటించాడు. బీబీఎల్ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందని.. ప్రస్తుతం తన దృష్టి గాయం నుంచి కోలుకుని బలంగా తిరిగి రావడంపై ఉందని తెలిపాడు. 

సిడ్నీ థండర్ యాజమాన్యం, ఆటగాళ్లు, అభిమానులు నాపై చూపించిన ప్రేమానురాగాలకు కృతజ్ఞుడనని పేర్కొన్నారు. సిడ్నీ యాజమాన్యం మా మొదటి సంభాషణ నుండే నన్ను క్లబ్‌లో భాగమని భావించేలా చేశారని ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే సీజన్‌లో ఆడలేకపోయినా జట్టుతో ఉండి ఆటగాళ్లు, అభిమానులను ఉత్సాహపర్చేందుకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. 

అశ్విన్ గాయంపై సిడ్నీ థండర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఈ మేరకు సిడ్నీ థండర్ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోప్లాండ్  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అశ్విన్ మోకాలి గాయం గురించి తెలిసి సిడ్నీ థండర్‌లోని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారని పేర్కొన్నారు. గాయం కారణంగా BBL 15 సీజన్ మొత్తానికి అశ్విన్ దూరమయ్యాడని తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.  

కాగా, అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విదేశీ లీగులలో ఆడాలని అశ్విన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌‌‌‌‌‌‌‌బాష్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో సిడ్నీ థండర్స్‌‎తో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో ఈ టోర్నీలో పాల్గొంటున్న హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా అశ్విన్ ఘనత సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా బీబీఎల్‎లో అరంగ్రేటం చేయకుండానే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. 2025-2026 బిగ్‌బాష్ లీగ్ సీజన్ 2025, డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది.

బీబీఎల్ 15 సిడ్నీ థండర్ జట్టు:

వెస్ అగర్, టామ్ ఆండ్రూస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లాండ్) ఒల్లీ డేవిస్, లాకీ ఫెర్గూసన్ (NZ), మాథ్యూ గిల్కేస్, క్రిస్ గ్రీన్, ర్యాన్ హాడ్లీ, షాదాబ్ ఖాన్ (పాక్), సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌ఆండ్రూ, బ్లేక్ నికితారాస్, అడియన్ ఓ'కానర్, డేనియల్ సామ్స్, తన్వీర్ సంఘ, డేవిడ్ వార్నర్.