ఏపీలో మరో ప్రమాదం: హైదరాబాద్ వస్తుండగా బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఏపీలో మరో ప్రమాదం: హైదరాబాద్ వస్తుండగా బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చిన్నటేకూరు దగ్గర వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది మరణించారు. ఈ తీవ్ర విషాద ఘటన మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం (నవంబర్ 3) రాత్రి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్‌ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ

 ప్రమాదంలో ఒకరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు భారతి ట్రావెల్స్‎కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

 బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.