Balakrishna: తొలిసారి దిల్ రాజ్ నిర్మాణంలో బాలయ్య.. మలయాళ సెన్సేషన్ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్!

Balakrishna: తొలిసారి దిల్ రాజ్ నిర్మాణంలో బాలయ్య.. మలయాళ సెన్సేషన్ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'అఖండ 2'  అభిమానులను కొంత నిరాశ పరిచింది. ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సారి పక్కా హీట్ కోసం రెడీ అయ్యారు బాలయ్య. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ హనీఫ్ అడెనితో బాలయ్య చేయబోయే సినిమా అని నెట్టింట ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

 మాస్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్

మలయాళంలో 'ది గ్రేట్ ఫాదర్', 'మిఖాయేల్' , ఇటీవల విడుదలైన వయొలెంట్ యాక్షన్ డ్రామా 'మార్కో' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు హనీఫ్ అడెని. ఆయన టేకింగ్ అంటేనే స్టైలిష్ యాక్షన్, రా అండ్ రస్టిక్ విజువల్స్. ఇప్పుడు ఈ యాక్షన్ మాస్టర్ బాలయ్య మాస్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసేలా ఒక హై-వోల్టేజ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక పవర్‌ఫుల్ కాప్ డ్రామా అని, ఇందులో బాలయ్య మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.  

Also Read :  తలైవా పెద్ద మనసు.. 45 తులాల బంగారం అప్పగించిన మహిళకు రజనీ స్పెషల్ గిఫ్ట్!

తొలిసారి సెన్సేషనల్ కాంబో!

ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దిల్ రాజు ఇప్పటికే హనీఫ్ అడెనితో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఆ కథ బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని భావించి ఆయనను సంప్రదించగా, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు - బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'అఖండ 2' తర్వాత తన నిజమైన రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.  అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

స్పీడ్ గా  షూటింగ్!

మలయాళ దర్శకులు చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేయడంలో దిట్టలు. హనీఫ్ అడెని కూడా అదే స్టైల్‌లో ఈ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి, అత్యుత్తమ అవుట్‌పుట్ ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారట. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పూర్తి చేసిన వెంటనే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలయ్య మార్క్ డైలాగులు, హనీఫ్ అడెని మార్క్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం అని అభిమానులు సంబరపడుతున్నారు.