సూపర్‌స్టార్ రజనీకాంత్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ 'మంచి మనసున్న మనిషి' అని మరోసారి నిరూపించుకున్నారు. నిజాయితీకి మించిన ఆస్తి మరొకటి లేదని చాటిచెప్పిన ఒక సామాన్య పారిశుధ్య కార్మికురాలిని తన నివాసానికి పిలిచి మరీ గౌరవించారు. వారికి బహుమతి ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఇప్పుడు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తలైవా పెద్ద మనసుకు నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిజాయితీకి దక్కిన 'సూపర్' గౌరవం
చెన్నైలోని టి.నగర్ ప్రాంతంలో పద్మ అనే మహిళ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధి నిర్వహణలో ఉండగా, రోడ్డుపై ఒక పౌచ్ కనిపించింది. తీరా తెరిచి చూస్తే అందులో ఏకంగా 45 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. నేటి కాలంలో రూపాయి దొరికితేనే జేబులో వేసుకునే వారున్న ఈ సమాజంలో.. పద్మ ఏమాత్రం తటపటాయించకుండా వెంటనే తన పైఅధికారులకు సమాచారం అందించారు. ఆ పౌచ్‌ను పాండీ బజార్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. పోలీసులు విచారణ జరిపి ఆ నగలను అసలైన యజమానికి అప్పగించారు.
ALSO READ : షాహిద్ కపూర్ ‘ఓ రోమియో’కి లీగల్ షాక్..
ఇంటికి పిలిచి సత్కరించిన తలైవా
పద్మ చేసిన ఈ గొప్ప పని గురించి తెలుసుకున్న రజనీకాంత్.. ఆమెను తన పోయెస్ గార్డెన్ నివాసానికి ఆహ్వానించారు. సామాన్యుల పట్ల ఎప్పుడూ ఎంతో వినమ్రంగా ఉండే రజనీ, పద్మను సాదరంగా ఆహ్వానించి ఆమెతో ముచ్చటించారు. ఆమె నిజాయితీని ప్రశంసించారు. బంగారు గొలుసును బహుమతిగా అందించారు. రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకుడు తనను స్వయంగా పిలిచి గౌరవించడంతో పద్మ ఆనందానికి అవధులు లేవు. మరో వైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా పద్మను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పక్షాన ఆమెకు రూ. 1 లక్ష నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
రజనీ.. మానవత్వానికి మారుపేరు
అభిమానులను, సమాజానికి మేలు చేసే వారిని రజనీ గౌరవించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మదురైకి చెందిన రజనీ శేఖర్ అనే అభిమాని, పేదల కోసం కేవలం తక్కువ ధరకే పరోటాలు విక్రయిస్తూ సేవలందిస్తుండగా.. అతడిని కూడా రజనీ పిలిచి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. తన స్థాయిని మర్చిపోయి సామాన్యులను అక్కున చేర్చుకోవడం రజనీ స్టైల్ అని అభిమానులు కొనియాడుతున్నారు. నిజాయితీ గల పద్మను గౌరవించడం ద్వారా రజనీకాంత్ తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన సినిమాలే కాదు, ఇలాంటి పనులు కూడా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి.
ALSO READ : పసి ప్రాణానికి పునర్జన్మ.. చిన్నారి పాలిట దేవదూతగా మారిన నటి శృతి హాసన్!
సినిమాల సందడి..
మరోపక్క సినిమాలతో రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు. 'నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ 'జైలర్'కు సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ నుంచి డైరెక్టర్ సిబి చక్రవర్తితో కలిసి ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఇది పక్కా కమర్షియల్ సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుంది అని రజనీ స్వయంగా వెల్లడించారు. ఇక కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మించే సినిమాలో రజనీ నటించబోతున్నారు. ముఖ్యంగా 'తలైవా 173' తర్వాత రజనీకాంత్ - కమల్ హాసన్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. దీనికి నెల్సన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
In a heartwarming gesture#SuperstarRajinikanth honours frontline worker Padma with a gold chain for her selfless service and good Samaritan spirit. 🙏✨@rajinikanth#ThalaivarNirantharam #ThalaivarForLife @ash_rajinikanth @soundaryaarajni @ParasRiazAhmed1 @V4umedia_ pic.twitter.com/JFxJYdgrEB
— RIAZ K AHMED (@RIAZtheboss) February 3, 2026
