హైదరాబాద్: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సీసీఎస్లో నమోదైన 4 కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఐబొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరణతో ఐబొమ్మ రవి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ మంజూరైతే దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, దర్యాప్తు ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని రవి దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఐబొమ్మ రవి హైకోర్టును ఆశ్రయించాడు.
