హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి కూకట్ పల్లి విజయలక్ష్మి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం సాయంత్రమే విజయలక్ష్మి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గాంధీ హాస్పిటల్లో విజయలక్ష్మి మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది.
తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునేందుకు విజయ లక్ష్మి ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంట్లో తన తల్లి ఉండడంతో ఆమె ఆత్మహత్యా యత్నం విఫలమైంది. విజయలక్ష్మి కొన్ని నెలలుగా సైకియాట్రిస్ట్ దగ్గర మందులు వాడుతుంది. తన ల్యాప్ టాప్లో ‘How to Die’ అని ఆమె సెర్చ్ చేసింది.
గత సంవత్సరం జూలైలో విజయ లక్ష్మి జాబ్ మానేసింది. ఈ ఫిబ్రవరిలో మాదాపూర్లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉండగా ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తన మానసిక పరిస్థితి బాలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్తున్నారు.
పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకుందని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కూకట్ పల్లి పోలీసులు స్పష్టం చేశారు. తమ వివరాలు బహిర్గతం చేయవద్దని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయలక్ష్మి స్వస్థలం భైంసా, మార్వాడి కులానికి చెందిన మృతురాలు. మల్కాజ్ గిరిలో విజయలక్ష్మి బీటెక్ పూర్తి చేసింది.
అసలేం జరిగింది..?
తాను పెండ్లి చేసుకొని వెళ్లిపోతే తన తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే ఆలోచనతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు సోమవారం ట్రేస్ అవుట్ చేశారు.
లేక్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మోతీ నగర్లో అద్దెకు ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటోంది. తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. కజిన్ బ్రదర్స్ వీరికి అండగా ఉంటూ విజయలక్ష్మికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో “నేను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుంది” అనే ఆలోచనతో ఆమె అనేకసార్లు మదన పడేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
దీంతో ఏం చేయాలో తెలియక తన ల్యాప్‌టాప్‌లో “ఆత్మహత్య ఎలా చేసుకోవాలి” అని సెర్చ్ చేసింది. జనవరి 31న ర్యాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్బ్రదర్స్ కూకట్‌పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా, డెడ్‌బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు.
