సరిగ్గా ఏడాది క్రితం అల్లర్లు, ఉద్యమాలు, ఆందోళనతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కు కొత్త సీఎం రానున్నారు. తీవ్ర అల్లర్లతో రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోల్ లోకి రావడంతో కొత్త ముఖ్యమంత్రిని నియమించేందుకు మార్గం సుగమం అయ్యింది. బీజేపీ నేత యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ ను పార్టీ లెజిస్లేటివ్ లీడర్ గా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. ఆయనను కొత్త సీఎంగా ప్రకటించింది.
ఎవరీయన..?
మణిపూర్ రాజకీయాల్లో యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ సీనియర్ బీజేపీ నాయకులు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంఫాల్ వెస్ట్ లోని సింగ్జమై నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2017 నుంచి మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు.
2022 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వంలో ఆయనను కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. 2025 ఫిబ్రవరి లో రాష్ట్రపతి పాలన విధించే వరకు మున్సిపల్, హౌజింగ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్, విద్యాశాఖలను ఆయన నిర్వర్తిస్తూ వచ్చారు.
తైక్వాండోలో ఆ అవార్డు అందుకున్న మొదటి ఇండియన్..
రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఆసక్తి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2025 డిసెంబర్ లో సియోల్ లో గ్లోబల్ ట్రెడిషనల్ తైక్వాండో ఫెడరేషన్ ఆయనకు ఫిఫ్త్–డాన్ బ్లాక్ బెల్ట్ అవార్డును ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న మొదటి ఇండియన్ గా ఆయన చరిత్ర సృష్టించారు. 16 ఏళ్ల నుంచి తైక్వాండోలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవవార్డును ప్రధానం చేశారు.
మణిపూర్ అల్లర్లు.. ప్రసిడెంట్ రూల్:
2023మే నుంచి మణిపూర్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. రెండు తెగల మధ్య హింసాత్మక ఘటనలు రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. లోయలోని మైటీ తెగ, కొండల్లోని కుకీ జో తెగల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఘర్షణలు ముదిరి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. 2024లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చి దాదాపు 250 మందికి పైగా మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలు జరిగాయి. దాదాపు ఏడాదంతా తుపాకీ కాల్పుల మోతలతో మణిపూర్ అట్టుడికిపోయింది.
2024లో గ్రామస్తులపై జరిగిన దాడులతో మణిపూర్ లో హింస ప్రారంభమైంది. ఏప్రిల్ లో ఎన్నికల సమయంలో హింస, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. జూన్ లో అసోం సరిహద్దుల్లో జరిగిన హింసతో మణిపూర్ సంక్షోభం మరింత ముదిరింది. ఇది జాతి హింసకు దారి తీసింది. వరుస బాంబు దాడులు, రాకెడ్ దాడులతో మణిపూర్ దద్దరిల్లింది. దాడులతో మణిపూర్ ప్రజలు భయం గుప్పిట్లో బతికారు.
అల్లర్ల క్రమంలో మణిపూర్ లో శాంతిని నెలకొల్పడంలో అటు కేంద్ర ప్రభుత్వం, అప్పటి సీఎం బీరేన్ సింగ్ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.
