ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి ఛాన్స్‌.. హర్మన్‎కు ఐసీసీ షాక్..!

ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి ఛాన్స్‌.. హర్మన్‎కు ఐసీసీ షాక్..!

దుబాయ్: ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌-2025 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీని ఐసీసీ మంగళవారం (నవంబర్ 4) ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ఈ జట్టులో టోర్నీ విజేత భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. వరల్డ్ కప్‎లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ ప్లేయర్స్ స్మృతి మందనా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీకి ఎంపికయ్యారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‎కు అనుహ్యంగా ఈ జట్టులో చోటు దక్కలేదు. 

ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన హర్మన్ ప్రీత్ కౌర్‎ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఈ వరల్డ్ కప్‎లో పరుగుల వరద పారించి తన జట్టును ఫైనల్‎కు తీసుకెళ్లిన దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్డ్‌ ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ కెప్టెన్‎గా ఎంపికైంది. ఐసీసీ జట్టులో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురి చొప్పున సెలెక్ట్ అయ్యారు. పాకిస్తాన్, ఇంగ్లాండ్ నుంచి ఒక్కొక్కరికి  చోటు దక్కింది. 12వ ప్లేయర్‎గా ఇంగ్లాండ్ క్రీడాకారిణి నాట్ స్కైవర్‌ బ్రంట్ సెలెక్ట్ అయ్యింది.

స్వదేశంలో జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‎లో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించి.. తొలి ఐసీసీ వరల్డ్ కప్ కలను సాకారం చేసుకున్నారు ఇండియా అమ్మాయిలు. భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఓపెనర్ స్మృతి మందనా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ కీలక పాత్ర పోషించారు. ఓపెనర్‌ స్మృతి మంధాన 54.25 సగటుతో 434 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

ఇక.. జెమిమా రోడ్రిగ్స్ 58.40 సగటుతో 292 రన్స్ చేసింది. సెమీఫైనల్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై 127 పరుగులు అజేయంగా నిలిచి.. టీమిండియా ఫైనల్‌ చేరడంలో కీ రోల్ ప్లే చేసింది. తన జీవితంలో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడింది. ఆల్ రౌండర్ దీప్తిశర్మ టోర్నీలో బ్యాట్, బాల్‎తో రాణించింది.  బ్యాట్‌తో 215 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించి 22 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నీగా ఎంపికైంది. 

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 జట్టు:

స్మృతి మంధాన (భారత్), లారా వోల్వార్డ్ట్ (సి) (దక్షిణాఫ్రికా), జెమిమా రోడ్రిగ్స్ (భారత్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్), అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), నాడిన్ డి క్లర్క్ (దక్షిణాఫ్రికా), సిద్రా నవాజ్ (WK) (పాకిస్తాన్), అలనా కింగ్ (ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), 12వ ప్లేయర్‌ నాట్ స్కైవర్‌ బ్రంట్ (ఇంగ్లండ్‌)