‘నీ కోసం నా భార్యను చంపేశాను’.. భార్యను చంపేసి ఫోన్ పేలో మెసేజ్.. బయటపడిన బెంగళూరు డాక్టర్ బాగోతం

‘నీ కోసం నా భార్యను చంపేశాను’.. భార్యను చంపేసి ఫోన్ పేలో మెసేజ్.. బయటపడిన బెంగళూరు డాక్టర్ బాగోతం

బెంగళూరులో డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను హత్య చేసిన తర్వాత “I killed my wife for you” ( ‘నీ కోసం నా భార్యను చంపేశాను’ ) అని ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి నలుగురు, ఐదుగురు మహిళలకు మెసేజ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఒక మహిళ.. డాక్టర్ మహేంద్ర రెడ్డి పనిచేస్తున్న హాస్పిటల్లో డాక్టర్ అని తెలిసింది. మహేంద్ర రెడ్డి ముందు నుంచి తనను ఇబ్బంది పెడుతుండటంతో సదరు మహిళా డాక్టర్ అతనిని బ్లాక్ చేసింది. మెసెంజింగ్ ప్లాట్ఫామ్స్లో బ్లాక్ చేయడంతో డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి  ‘I killed my wife for you' అని మహేంద్ర రెడ్డి ఆమెకు మెసేజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కృతిక రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో మహేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్ను, ల్యాప్ టాప్ను సీజ్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. తాజాగా.. అతని మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలించగా.. ఫోన్ పే (PhonePe) నుంచి ఈ మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. మహేంద్ర రెడ్డిని అతని పెళ్లికి ముందు నుంచే దూరం పెట్టానని, కృతికతో పెళ్లి కుదిరిందని తెలిసి.. అతని ఫోన్ నంబర్తో పాటు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో కూడా బ్లాక్ చేశానని ఆమె పోలీసులకు తెలిపింది.

అసలేం జరిగింది..? మహేంద్ర భార్య ఎలా చనిపోయింది..?
బెంగళూరులో భార్యను చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిన భర్త బాగోతం ఆరు నెలల తర్వాత బయటపడింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించేశారు. డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతిక రెడ్డికి మే 26, 2024న అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్గా పనిచేస్తుండగా, కృతిక రెడ్డి కూడా అదే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్గా పనిచేస్తోంది. ఇద్దరూ బెంగళూరులోని మారతహళ్లిలో కాపురం పెట్టారు. మంచి ఉద్యోగం. మంచి శాలరీ. పెళ్లయిన కొన్ని నెలలు దాంపత్య జీవితం సాఫీగా సాగింది.

►ALSO READ | డ్రైవర్ నిర్లక్ష్యంతో ముగ్గురి బలి.. తాగకపోయినా ముగ్గురి మృతికి కారణమైన భారతీయ డ్రైవర్..

కానీ.. ఉన్నట్టుండి ఒకరోజు కృతికకు వాంతులయి అనారోగ్యానికి లోనైంది. మహేందర్ రెడ్డి ఆమెకు మెడికల్ టెస్టులు చేయించాడు. ఈ వైద్య పరీక్షల్లో కృతికకు అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్, లో షుగర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలింది. పెళ్లికి ముందు నుంచే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నా తనకు చెప్పకుండా కృతికను ఇచ్చి పెళ్లి చేశారని మహేందర్ రెడ్డి రగిలిపోయాడు. అప్పటి నుంచి భార్యపై కోపం పెంచుకున్నాడు. అయితే.. ఆమె ముందు ఆ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకుండా మంచి వాడిలా నటిస్తూ అతనిలోని సైకోను నిద్రలేపాడు. తనను మోసం చేశారనే భావనతో భార్యను చంపాలని డిసైడ్ అయ్యాడు.

అయితే.. మర్డర్ కేసులో ఇరుక్కోకూడదని, ఆమెకు ఉన్న అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని నమ్మించాలని స్కెచ్ వేశాడు. కృతిక అనారోగ్యంతో బాధపడుతూ పుట్టింట్లో ఉండగా, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణం పోయేలా ఐవీ ఇంజెక్షన్ నుంచి ఏదో ఇవ్వకూడని మెడిసిన్ ఇచ్చాడు. అలా రెండు రోజులు మెడిసిన్ ఇచ్చాక ఏప్రిల్ 23, 2025న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

కృతికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఆమె బాడీ శాంపిల్స్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపించారు. FSL రిపోర్ట్లో అనస్థీషియా ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల ఆమె చనిపోయిందని వెల్లడైంది.