జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు మంగళవారం (నవంబర్ 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఇరు పార్టీ నేతలు చర్చించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. 

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా, ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిత్రపక్షమైన బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ మద్దతు ఇస్తోంది. దివంగత నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ బైపోల్‎ను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ప్రకటింది. తాజాగా.. బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు జనసేన తెలిపింది. కాగా, బీఆర్ఎస్ తరుఫున గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి లోకల్ యువ నాయకుడు నవీన్ యాదవ్ పోటీలో ఉన్నాడు. ఇక, బీజేపీ లంకల దీపక్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. 2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెలువడనుంది. ఎన్నికకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి.