తిరుమల కొండపై హోటళ్లల్లో.. సంప్రదాయ ఆహారం మాత్రమే ఉండాలి

తిరుమల కొండపై హోటళ్లల్లో.. సంప్రదాయ ఆహారం మాత్రమే ఉండాలి

తిరుమల కొండపై ఉన్న హోటళ్లల్లో చైనీస్ ఫుడ్స్ ఉండొద్దని.. హోటల్స్ అన్నీ సంప్రదాయ ఆహారం మాత్రమే భక్తులకు అందించాలని ఆదేశించారు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి. 2025, నవంబర్ 4వ తేదీన జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారాయన. ఈ మేరకు పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించి.. హోటల్స్ నిర్వహకులతో చర్చించి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారాయన. 

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి తిరుమల కొండకు వచ్చే భక్తులకు మెరుగైన, సంప్రదాయమైన.. రుచికరమైన, శుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రతి హోటల్ నిర్వాహకుడిపై ఉందన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ప్రతి వ్యాపారి సంప్రదాయ ఆహారం అందించే విధంగా వాళ్లకు అవగాహన కల్పించి.. అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారాయన. 

ఆహారం విషయంలోనే కాకుండా తిరుమల కొండపై పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆ దిశగా అమలు అవుతున్న విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలన్నారాయన. కొండపై ఔషధ వనం.. ఔషధ పార్కును అభివృద్ధి చేయాలని.. ప్రణాళికలు రూపొందించి.. వెంటనే పనులు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అదే విధంగా కొండపై ఉన్న ఉద్యాన వనాలను సుందరీకరించాలని.. ఎప్పటికప్పుడు వాటి పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యంగా సూచించారాయన.