పట్టణ తీర్పు.. హస్తం వైపే.. కాంగ్రెస్కే పట్టం కట్టిన ఓటర్లు 

పట్టణ తీర్పు.. హస్తం వైపే.. కాంగ్రెస్కే పట్టం కట్టిన ఓటర్లు 
  • నల్గొండ కార్పొరేషన్‌‌తో సహా10  మున్సిపాలిటీలు కైవసం
  • పట్టణాల్లో  పట్టు కోల్పోయిన బీఆర్​ఎస్​, బీజేపీ 
  • తిరుమలగిరిలోనే కారు స్పీడ్​ 
  • 196 వార్డుల్లో  కాంగ్రెస్, 71 వార్డుల్లో బీఆర్​ఎస్​,7 వార్డుల్లో బీజేపీ
  • నేరేడుచర్లలో ఖాతా తెరిచిన జనసేన

నల్గొండ, వెలుగు:  నల్గొండ కార్పొరేషన్​తో పాటు సూర్యాపేట జిల్లాల్లో మున్సిపాలిటీలను, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్​ కంచుకోటగా పేరొందిన జిల్లాలో మరోసారి తిరుగులే ని విజయాన్ని సొంతం చేసుకుంది. పల్లెల్లోనే గాక, పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్​కు​ పట్టం కట్టారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల్లో కాంగ్రెస్​10 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పొరేషన్​ కైవసం చేసుకుంది. తొలిసారిగా ఏర్పాటైన నల్గొండ కార్పొరేషన్​ పైన కాంగ్రెస్​ జెండా ఎగురవేసింది. 

బీఆర్​ఎస్​ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని సొంతం చేసు కుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపుల వల్ల అక్కడ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్​ అభ్యర్థులు అన్ని చోట్ల భారీ విజయం సాధించారు.  మొత్తం 302 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​192 వార్డులు గెలుచుకుంది.  బీఆర్‌‌‌‌ఎస్ కేవలం 71 వార్డుల్లోనే  గెలిచింది. బీజేపీ 7 వార్డుల్లో  మాత్రమే విజయం సాధించింది. ఎంఐఎం నల్గొండలో రెండు డివిజన్​లు, ఫార్వర్డ్​ బ్లాక్​ అభ్యర్థులు 5 స్థానాల్లో సత్తా చాటారు.  జనసేన తొలిసారిగా జిల్లాలో నేరేడుచర్లలో ఒక వార్డులో గెలిచి తెలంగాణలో ఖాతా తెరిచింది.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ 

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి మరోసారి కాంగ్రెస్ అడ్డాగా నిలిచింది.  నల్గొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.  మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 48  డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 27 డివిజన్లను గెలుచుకొని తొలిసారి  మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.  ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 9  డివిజన్లు బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు గెలిచారు.  కాంగ్రెస్  మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి 32వ డివిజన్ నుంచి పోటీ చేసి 
గెలుపొందారు.  

ఫలించిన మంత్రుల వ్యుహాం

సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు కాంగ్రెస్​ సొంతం చేసుకోగా, తిరుమలగిరిలో మాత్రమే బీఆర్​ఎస్ గెలిచింది. హుజూర్​నగర్​, సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల లో ఉత్తమ్​ సమీక్షలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు దోహద పడ్డాయి. అభ్యర్థులను వెంటపెట్టుకుని ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థిం చారు.

మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామనే హామీ మేరకు ఓటర్లు కాంగ్రెస్​ వైపు ఆకర్షితులయ్యారు. సూర్యాపేట జిల్లాలో 141 వా ర్డుల్లో కాంగ్రెస్​ 137 వార్డుల్లో పోటీ చేయగా 90 చోట్ల గెలిచింది. హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ 19 వార్డులు గెలిస్తే,  కోదాడలో 26 వార్డుల్లో గె లుపొందింది. నేరేడుచర్లలో 9 వార్డులు సొంతం చేసుకుంది. సూర్యాపేటలో మున్సిపల్​ చైర్మన్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించడంతో ఇక్కడ అభ్యర్థులు సునాయసంగా గెలిచారు. మంత్రి ఉత్తమ్​సపోర్ట్ తో రాంరెడ్డి సర్వోత్తమ్​ రెడ్డి, వేణారెడ్డి చేసిన కృషి కారణంగా ఏకంగా 31 వార్డులను కైవసం చేసుకుంది. 

నల్లగొండ జిల్లాలో  కాంగ్రెస్​ జోష్​..

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్​షోలతో కార్పొరేషన్​లో 27 వార్డుల్లో కాంగ్రెస్​ గెలిచింది. మిర్యాలగూడలో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన తర్వాత కాంగ్రెస్​లో జోష్​ కనిపించింది. 31 వార్డుల్లో కాంగ్రెస్​ విజయం భేరి మోగించింది.  ఎమ్మెల్యేలు బాలూ నాయక్​, వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా అమి త్​ రెడ్డి, కుందూరు జైవీర్​ రెడ్డి ఎన్నికల్లో అభ్యర్థుల వెన్నంటే ఉండి ప్రచారం చేయడంతో కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్​ చేసింది.  చిట్యాలలో వీరేశంతో కలిసి అమిత్​ చేసిన జాయింట్​ ఆపరేషన్ విజయవంతమైంది.