మేం ఓడిపోలే.. ఓడించారు! : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

మేం ఓడిపోలే.. ఓడించారు! : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  • బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి: రాంచందర్​ రావు
  •     ఆ మూడు పార్టీలది ‘ఫెవికాల్’ బంధం
  •     సీట్లు తక్కువొచ్చినా.. ఓట్ల శాతం పెరిగింది
  •     హంగ్ వచ్చిన చోట ఎవరికీ మద్దతివ్వం 
  •     మజ్లిస్ దయ లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచేవే కాదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో పనిచేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. ఈ మూడు పార్టీల మధ్య విడదీయరాని ‘ఫెవికాల్ బంధం’ ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీ ఒక్కటయ్యాయని అన్నారు. 

తాము ఓడిపోలేదని, అంతా కలిసి ఓడించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సీట్లు మేము అంచనా వేసిన దాని కంటే తక్కువగా వచ్చినా.. ఓట్ల శాతం మాత్రం భారీగానే వచ్చాయని వివరించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయాలు మజ్లిస్ పెట్టిన భిక్ష

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సాధించిన విజయాలు సొంత బలంతో వచ్చినవి కావని, అవన్నీ మజ్లిస్ పార్టీ పెట్టిన భిక్షేనని రాంచందర్ రావు విమర్శించారు. ‘‘బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్న చోట.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారు. 

దీన్ని బట్టే వారి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏంటో అర్థమవుతోంది’’ అని చెప్పారు. మజ్లిస్ మద్దతే లేకపోతే చాలాచోట్ల ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కేవి కావన్నారు. త్రిముఖ పోటీని సృష్టించి, ఓట్లు చీల్చి బీజేపీని ఓడించారని రాంచందర్ రావు మండిపడ్డారు. ఈ కుట్ర కారణంగానే సుమారు 200 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు కేవలం 2 నుంచి 25 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓడిపోయారని వివరించారు.

అయినప్పటికీ ప్రజలు బీజేపీని ఆదరించారని, పార్టీ ఓటు షేర్13 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని, బీఆర్ఎస్ దిగజారుతుంటే బీజేపీ ఎదుగుతోందని స్పష్టం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే స్కెచ్ వేసిందని రాంచందర్ రావు ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి, ఒక మేయర్ సీటును మజ్లిస్ పార్టీకి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

ఎవరికీ మద్దతివ్వం.. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని రాంచందర్​రావు తేల్చిచెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, ఎవరైనా తమకు మద్దతిస్తే తీసుకుంటామన్నారు. అధికారికంగా 250కి పైగా వార్డుల్లో గెలిచామని, మొత్తం 350 సీట్ల వరకు గెలిచే అవకాశముందని తెలిపారు. 6 మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించామని, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న విజయాలన్నీ అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతో వచ్చినవేనని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోశించడంతో ఫెయిల్ అయిందని, ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నామంటూ సంతోషపడుతుందన్నారు. గతంలో వచ్చిన స్థానాలెన్నీ.. ఇప్పుడు ఎన్నో చూసుకుంటే బెటర్ అని చెప్పారు. కాంగ్రెస్​ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు, ఉపాధ్యక్షురాలు మాధవి, కోశాధికారి దేవకి వాసుదేవరావు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పాల్గొన్నారు.