న్యూఢిల్లీ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన అద్భుతమంటూ ప్రశంసించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు భేష్ అని కితాబిచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, పొత్తుల గురించి ప్రియాంక గాంధీ ఆరా తీశారు. ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? ఎన్నిచోట్ల విజయం సాధించాం? ఎన్ని కౌన్సిలర్లను కైవసం చేసుకున్నాం? వంటి విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా.. బీజేపీ పరిస్థితి ఏమిటి? బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
