పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా డిప్యుటేషన్లకు ఓకే

పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా డిప్యుటేషన్లకు ఓకే
  • జీవో 317 బాధితులకు ఊరట.. 223 మందికి అవకాశం
  • రెండేండ్లు సొంత జిల్లాల్లో పనిచేసేలా వెసులుబాటు
  • జీవో 190 అమలు చేసిన తొలి శాఖగా పంచాయతీ రాజ్ రికార్డు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శుల అంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా డిప్యుటేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 223 మంది పంచాయతీ కార్యదర్శులకు అంతర్ జిల్లా డిప్యుటేషన్ కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరందరికీ రెండేండ్ల పాటు డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై పనిచేసేందుకు అనుమతి లభించింది. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవో నం.317 కారణంగా స్థానికత కోల్పోయి, దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శుల ఇబ్బందులను సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్న మంత్రి సీతక్క.. పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

జీవో 317 నష్టాలను సరిదిద్దేందుకు వేసిన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఇటీవలే జీవో 190ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా అంతర్ జిల్లా డిప్యుటేషన్ ప్రక్రియను ప్రారంభించిన తొలి శాఖగా పంచాయతీ రాజ్ నిలవడం విశేషం. ఖాళీలున్న ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా ఈ డిప్యుటేషన్లకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందికి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ, పారదర్శకంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. తాజా నిర్ణయంతో కార్యదర్శులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: పంచాయతీ కార్యదర్శుల సంఘాలు 

నాలుగేండ్లుగా స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక ఆవేదనకు గురైన తమకు ప్రభుత్వం అండగా నిలిచిందని పంచాయతీ కార్యదర్శుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి ఉత్తర్వులిచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ఎమ్మెస్ వాణి, పాండరీ, సతీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్, కె.అరుణ్ కుమార్, కవిత ధన్యవాదాలు తెలిపారు.