ఇండిపెండెంట్ కోసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేజింగ్.. జనగామ లో ఇండిపెండెంట్ ను తీసుకెళ్లిన బీఆర్ఎస్

ఇండిపెండెంట్ కోసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేజింగ్.. జనగామ లో ఇండిపెండెంట్ ను తీసుకెళ్లిన బీఆర్ఎస్
  •     వెంటాడి క్యాచ్ చేసిన కాంగ్రెస్​
  •     భువనగిరిలోని బైపాస్​లో ఓ హోటల్ వద్ద హైడ్రామా
  •     పరిగి, ఆలియాబాద్​లోనూ రసవత్తరంగా రాజకీయం

జనగామ/ యాదాద్రి/ పరిగి, వెలుగు: ఇండిపెండెంట్ కౌన్సిలర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సినిమా రేంజ్​లో చేజింగ్ జరిగింది. జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13 గెలుచుకుంది. కాంగ్రెస్ 12, సీపీఎం ఒకటి గెలుచుకోవడంతో రెండు పార్టీల సీట్లు 13కు చేరాయి. ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు. దీంతో ఇండిపెండెంట్లకు డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన భూష పర్వతాలు 23వ వార్డులో ఇండిపెండెంట్​గా పోటీ చేసి గెలిచారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన పర్వతాలును బీఆర్ఎస్ లీడర్లు క్యాచ్ చేసి కారులో హైదరాబాద్​కు తీసుకెళ్తున్న సమయంలో మధ్యలో కొద్దిసేపు ఆగారు. 

అదే సమయంలో బీఆర్ఎస్ కారును చేజ్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ లీడర్లు భూష పర్వతాలును తమ కారులో ఎక్కించుకొని హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఆ వెనకే బీఆర్ఎస్ లీడర్లు వెంటాడారు. యాదాద్రి జిల్లా భువనగిరి బైపాస్​కు చేరుకున్న అనంతరం పర్వతాలును వెంట తీసుకొని ఓ హోటల్​లోకి కాంగ్రెస్ లీడర్లు వెళ్లారు. ఈ చేజింగ్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. 

కొద్దిసేపటికే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు చేరుకొని హోటల్​లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే పల్లా, బీఆర్ఎస్ లీడర్లు అక్కడే బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పల్లా వినలేదు. చివరకు పర్వతాలు అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ లీడర్లు తెలిపారు. పర్వతాలు తాను బీఆర్ఎస్​తోనే వెళ్తానని చెప్పగా.. బీఆర్ఎస్ లీడర్లు ఆయన్ను తీసుకొని వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ క్యాంపులో ఇద్దరు, కాంగ్రెస్​లో ఒక్కరు

బీఆర్ఎస్ నుంచి గెలిచిన 13 మంది ఉన్న క్యాంప్​లోనికి ఇద్దరు ఇండిపెండెంట్లు చేరినట్టుగా తెలుస్తుంది. 23వ వార్డు నుంచి గెలిచిన భూష పర్వాతాలు, 8వ వార్డు నుంచి గెలిచిన సందుపట్ల మంజుల తమతో ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 5వ వార్డు నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ కాంగ్రెస్ క్యాంపులో చేరారు. 15వ వార్డు నుంచి గెలిచిన మరో ఇండిపెండెంట్ పాండు తనకు గౌరవప్రదమైన పదవి ఇచ్చిన వారికి మద్దతు ఇస్తానని ప్రకటించినట్టుగా సమాచారం.

పరిగిలో బీఆర్ఎస్​కు ఇండిపెండెంట్ రిటర్న్ ఆఫర్!

పరిగిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ 8 స్థానాల చొప్పున దక్కించుకోవడం, మిగిలిన రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడంతో ఉత్కంఠ నెలకొన్నది. చైర్​పర్సన్​పీఠం కోసం మరో రెండు సీట్లు కావాల్సి ఉండడంతో మొదటి వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్ధి అక్కమ్మ, మూడో వార్డు నుంచి గెలుపొందిన హనుమంతు (కమల్) ఏ పార్టీకి మద్దతు ఇస్తారోనన్న ఉత్కంఠ నెలకొన్నది. హన్మంతు గెలిచాక ఇంటికి వెళ్లే క్రమంలో రెండు పార్టీల లీడర్లు ఆయనను తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. 

దీంతో పోలీసులు వచ్చి రెండు పార్టీల వారిని చెదరగొట్టారు. ఇక ఒకటో వార్డులో గెలిచిన ఇండిపెండెంట్​అక్కమ్మ కనిపించకుండా పోవడంతో ఆమెను బీఆర్ఎస్​లీడర్లు కిడ్నాప్​చేశారని అక్కమ్మ కొడుకు పరిగి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అక్కమ్మను వెతికి రాత్రి వేళ తీసుకువచ్చారు. అయితే, రాత్రివేళ మళ్లీ బీఆర్ఎస్​లీడర్లు ఆమెను హైదరాబాద్​తరలించారని కాంగ్రెస్​లీడర్లు ఆరోపించారు. తమకు మద్దతు తెలిపితే రూ.కోటి ఇస్తామని బీఆర్ఎస్​కోరగా, తనను చైర్​పర్సన్​చేస్తే రూ. 2 కోట్లు ఇస్తానని ఆమె రిటర్న్​ఆఫర్​ఇచ్చినట్టు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

ఆలియాబాద్​పైనే అందరి కన్ను  

అలియాబాద్ లో బీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఎనిమిది, బీజేపీకి 3, ఒక బీఎస్పీ అభ్యర్థి, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. దీంతో ఇక్కడ ఐదో వార్డులో గెలిచిన ఇండిపెండెంట్​అభ్యర్థి వెంకటేశ్​తో పాటు ఏడో వార్డులో గెలిచిన బీఎస్పీ నుంచి గెలిచిన గాదె వెంకటేశ్​కోసం రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. బీఆర్ఎస్​చైర్​పర్సన్​రే సులో ఉన్న ఓ లీడర్​ ఇండిపెండెంట్​అభ్యర్థి వెంకటేశ్​గెలుపు కోసం పని చేయగా, అతడు తనకు మద్దతు ఇస్తాడని నమ్మకం పెట్టుకున్నాడు. 

అయితే, గెలిచిన తర్వాత ఇండిపెండెంట్​అభ్యర్థి ఇంటికి వెళ్లగా అక్కడికే వెళ్లిన కాంగ్రెస్​పార్టీ లీడర్లు అతడిని తమ క్యాంపుకు తీసుకువెళ్లారు. అలాగే బీఎస్పీ అభ్యర్థి గాదె వెంకటేశ్ కోసం కూడా రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కౌంటింగ్​కేంద్రం నుంచి బయటకు వచ్చాక అతన్ని తీసుకెళ్లేందుకు రెండు పార్టీల లీడర్లు పోటీ పడ్డారు. గాదె వెంకటేశ్​ను కాంగ్రెస్ లీడర్లు తమ క్యాంప్ కు తరలించినట్టు సమాచారం.