- బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు
- అవి ఒప్పందాలు మాత్రమే
- కేంద్ర కమిటీ మీటింగ్ మినిట్స్‌లో వెల్లడి
- మినిట్స్ ను విడుదల చేసిన సీడబ్ల్యూసీ
- టెలిమెట్రీలు ఏర్పాటు చేసినా సరైన డేటా రావడం లేదన్న కృష్ణా బోర్డు
హైదరాబాద్, వెలుగు: గోదావరి బేసిన్లో ఇప్పటివరకూ ఏ రాష్ట్రానికీ కేటాయింపుల్లేవా? ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడున్న జలాలు కేటాయింపులు కాదా? అంటే.. రెండు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్ మినిట్స్‌లో అవుననే సమాధానమే వచ్చింది. గత నెల 30న ఢిల్లీలో కేంద్ర కమిటీ మీటింగ్ జరిగింది. తాజాగా ఆ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) విడుదల చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ 1980లో ఓ రిపోర్ట్ ఇచ్చిందని, నీళ్లకు సంబంధించి మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ మధ్య ఒప్పందాలు జరిగాయని ప్రజెంటేషన్‌లో వెల్లడించింది. అంతేతప్ప బచావత్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికీ కేటాయింపులు చేయలేదని, గోదావరి జలాల లెక్కలు తేల్చలేదని స్పష్టం చేసింది. ఇక, మీటింగ్‌లో కృష్ణా బోర్డు కూడా ప్రజెంటేషన్ ఇచ్చిందని మినిట్స్‌లో సీడబ్ల్యూసీ వెల్లడించింది. శ్రీశైలం వంటి ప్రాజెక్టుల స్కోప్ మారిందని, స్కోప్ మారితే ప్రాజెక్టులకు రీఅప్రైజల్ చేసుకోవాలని 2021 జులై 15న కేంద్రం జలశక్తి శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని కృష్ణా బోర్డు గుర్తు చేసింది.
ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లోని షెడ్యూల్ 1లో ఉన్న అన్ని టీఏసీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టుల స్కోప్ గురించి అడిగామని, రీఅప్రైజల్పై సీడబ్ల్యూసీని క్లారిఫికేషన్ అడిగామని పేర్కొంది. బోర్డు పరిధిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని, ఇంత వరకూ రెండు రాష్ట్రాలు బోర్డుకు ఒక్క ప్రాజెక్టును కూడా అప్పగించలేదని తెలిపింది. బోర్డు పరిధి తేలకుండా ప్రాజెక్టులను నియంత్రించలేమని స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల గేజింగ్, నీటి నిర్వహణ వంటి వ్యవహారాలు రాష్ట్రాలే చూసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని 12, 13 క్లాజుల్లో స్పష్టం చేశారని వెల్లడించింది. టెలిమెట్రీల విషయంలో బ్రజేశ్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని వివరించింది. ఏడేండ్ల కిందట 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశామని, వాటి వల్ల పెద్దగా ఫలితం రావడం లేదని పేర్కొంది. ఆ టెలిమెట్రీలతో సరైన డేటా రావడం లేదని పేర్కొంది. కాగా, రెండు రాష్ట్రాలు వారం రోజుల్లో ఎజెండాను సమర్పించేలా అంగీకరించాయని మినిట్స్‌లో సీడబ్ల్యూసీ తెలిపింది. ఆ తర్వాత పది రోజుల్లో ఎజెండాలు మార్చుకుని అభిప్రాయాలు తెలియజేసేలా అంగీకరించారని వెల్లడించింది.
