శిశుమందిర్‌‌లోని చిన్నారి  సంక్షేమంపై నివేదికివ్వండి : హైకోర్టు

శిశుమందిర్‌‌లోని చిన్నారి  సంక్షేమంపై నివేదికివ్వండి : హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పిల్లల అక్రమ రవాణా ముఠా ద్వారా ఓ దంపతులు దత్తత పొందిన చిన్నారిని శిశుమందిర్‌‌లో చేర్చిన ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ బాలిక సంక్షేమంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బాలిక అనారోగ్యంతో ఉందన్న ఆరోపణల దృష్ట్యా నివేదిక ఇవ్వాలని సూచిస్తూ విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. 2023లో దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు శిశుమందిర్‌‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం. వెంకన్న దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారించిన సింగిల్ జడ్జి.. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దత్తతను అనుమతించలేమని, చట్టవిరుద్ధ దత్తతకు అనుమతిస్తే పిల్లల అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లేనని తీర్పు వెలువరించారు.

సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకన్న దంపతులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌లతో కూడిన బెంచ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..చట్టపరమైన విధానాలు అనుసరించకపోయినా సొంత బిడ్డగా భావించి పెంచామని, బారసాల, పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. బాలికతో తమకు బలమైన అనుబంధం ఏర్పడిందని, ప్రస్తుతం తల్లిదండ్రుల ప్రేమ లేక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. శిశుమందిర్ నుంచి చిన్నారిని తిరిగి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..శిశువును అక్రమ రవాణా ముఠాలో ఉన్న నక్కా యాదగిరి నుంచి దత్తత తీసుకున్నారని, ఈ ముఠా ద్వారా 16 మంది పిల్లలను విక్రయించారని తెలిపారు. అందువల్ల అప్పీలును కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న బెంచ్.. ప్రస్తుతం శిశుమందిర్‌‌లో ఉన్న చిన్నారి సంక్షేమంపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.