- రిలీవ్ అయ్యేందుకు ఇష్టపడని ఐఏఎస్ దివ్య
హైదరాబాద్, వెలుగు: సచివాలయ వర్గాల్లో ఇప్పుడు ‘ప్రజావాణి’ నోడల్ ఆఫీసర్ పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. సామాన్యుడి గోడు వినేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బదిలీల్లో భాగంగా కొంతమంది ఐఏఎస్‌లు ఆ పోస్టు కోసం పోటీ పడుతున్నట్లు తెలిసింది. ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం, ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉండే పోస్టు కావడంతో.. సీనియర్లు సైతం దీనికోసం పోటీపడ్డారు. నిన్నటి వరకు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఐఏఎస్ దివ్యను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఐఏఎస్ కాత్యాయనికి ఈ బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. తన బదిలీ ఆర్డర్స్ రాగానే కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు ఐఏఎస్ కాత్యాయని వెళ్లగా.. అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటికే ఆ సీటులో ఉన్న దివ్య ఇంకా రిలీవ్ కాకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కాత్యాయని ఛార్జ్ తీసుకోవడం కుదరలేదని తెలుస్తుంది. ఇదే పోస్టులో కొనసాగుతానని ఐఏఎస్ దివ్య పట్టబడుతున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. పబ్లిక్‌కు డైరెక్ట్ సర్వీస్ చేసే పోస్టులకు, ప్రజల్లో ఫాలోయింగ్ ఉండే శాఖలకు ఐఏఎస్‌ల మధ్య డిమాండ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. లూప్ లైన్ పోస్టుల కంటే.. ఇలా జనం మధ్య ఉండే పవర్ ఫుల్ పోస్టుల కోసమే అధికారులు పోటీ పడుతున్నారన్నది ఈ ఎపిసోడ్ ద్వారా స్పష్టమవుతోంది.
