సత్తా చాటిన వామపక్షాలు..కొత్తగూడెంలో ఏకపక్షంగా ఫలితాలు

సత్తా చాటిన వామపక్షాలు..కొత్తగూడెంలో ఏకపక్షంగా ఫలితాలు
  •     మున్సిపోల్స్ లో సీపీఐ 40, సీపీఎం 13 స్థానాల్లో గెలుపు  
  •     మేయర్ పీఠం దిశగా అడుగులు

హైదరాబాద్, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వామపక్షాలు తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు మధ్యలోనూ తమకు పట్టున్న చోట సత్తా చాటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ దాదాపుగా 40 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించాయి. 

సీపీఎం13 స్థానాల్లో గెలుపొంది తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. కాగా, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఇక్కడ సీపీఐ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చి విజయం సాధించారు. సింగరేణి కార్మిక క్షేత్రంపై కమ్యూనిస్టుల పట్టు సడలలేదని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు సాధించిన సీపీఐ.. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమైంది. 

ఈ క్రమంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ సీపీఐకి మద్దతును ప్రకటించింది. దీంతో మేయర్ పీఠం సీపీఐ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గులాబీ పార్టీ మద్దతుతో కొత్తగూడెం మున్సిపల్ పీఠంపై సీపీఐ జెండా ఎగరనుంది. పొత్తులో భాగమా? లేక వ్యూహాత్మకమా? అన్న చర్చ పక్కనపెడితే.. బీఆర్ఎస్ మద్దతుతో వామపక్ష పార్టీకి మేయర్ పదవి దక్కనుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

లెఫ్ట్ పార్టీలు గెలిచిన స్థానాలు ఇవే..   

కొత్తగూడెంలో 22, ఖమ్మం జిల్లా ఏదలాపురంలో 3, వైరాలో 1, క్యాతనపల్లిలో 4, భూపాలపల్లి, చండూరు, హుజూర్​నగర్​, యాదగిరిగుట్ట, రామగుండంలో1 చొప్పున.. వీటితోపాటు మరికొన్నిచోట్ల సీపీఐ గెలుపొందింది.  మరోవైపు సీపీఎం కూడా13 వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటింది. పట్టణ ప్రాంతాల్లో, కార్మిక వాడల్లో సీపీఎం అభ్యర్థులు గణనీయమైన ఓట్లు సాధించారు. 

రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిపి మొత్తం 53 స్థానాల్లో గెలుపొందారు. ఖమ్మం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో వామపక్షాల మద్దతు అవసరమని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. కాగా, సీపీఎం 8 జిల్లాల్లో 13 సీట్లు కైవసం చేసుకున్నది. ఖమ్మం జిల్లాలో 2, కొత్తగూడెంలో 1, మహుబూబాబాద్​లో 3, వనపర్తిలో 2, నర్సంపేటలో, జనగామ, సూర్యాపేట, హూజూర్​నగర్, భువనగిరి, చౌటుప్పల్​లో 1 చొప్పున గెలుపొందింది.