- ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు
- పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస రోగుల నరకయాతన
- రూల్స్ బ్రేక్చేస్తున్నా పీసీబీ సైలెన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ నగరంలో రాత్రయ్యిందంటే చాలు ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శివారుతో పాటు నగరం నడిబొడ్డున కూడా ఈ సమస్య వేధిస్తున్నది. శివారు ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల వల్ల అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో ఘాటు వాసనల భారిన పడుతున్నా..ఈ మధ్య సిటీ సెంటర్లోని జనాలను ఈ వాసనలు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే బేగంపేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు రాత్రయ్యిందటే చాలు పుల్లటి వాసనలు ముక్కు పుటాలను అదరగొడుతున్నాయి. దీంతో చిన్నపిల్లలు గుక్క పెట్టి ఏడుస్తుండగా, వృద్ధులు, శ్వాస కోస సమస్యలున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి పూటే ఎందుకు?
రాత్రి, తెల్లవారుజామున వాతావరణంలో టెంపరేచర్ ఇన్వర్షన్ కారణంగా కెమికల్స్‌ను గాలిలోకి వదిలితే తీవ్రమైన ఘాటు వాసన వస్తుంది. పగటిపూట వేడికి పైకి వెళ్లే గాలి, రాత్రి చల్లబడి భూమికి దగ్గరగా వచ్చి పొరలా ఏర్పడుతుంది. పగలు పీసీబీ తనిఖీలు ఉంటాయని చాలా పరిశ్రమలు రాత్రి వేళ కెమికల్స్ ను వదులుతున్నాయి. దీంతో అవి పైకిపోలేక, భూమికి అతి సమీపంలోనే ఉండిపోతున్నాయి. ఇవి చాలా ఘాటుగా ఉండడంతో నేరుగా శ్వాసనాళాలకు తాకినట్లు అనిపిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర పీసీబీలు కొన్ని పద్ధతులు పాటించాలని ఆదేశించాయి. గాలి శుద్ధికి పరిశ్రమల్లో కొన్ని పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి. కానీ, .యాజమాన్యాలు అతి తెలివితో ట్యాంపరింగ్ చేస్తూ జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి.
ఏంటా పరికరాలు..ఎలా బ్రేక్ చేస్తున్నారు?
పీసీబీ తీసుకువచ్చిన పద్ధతి పేరు ఓసీఈఎంఎస్ అంటే ఆన్‌లైన్ కంటిన్యూస్ ఎమిషన్, ఎప్లుఎంట్ మానిటరింగ్ సిస్టమ్. ఓసీఈఎంఎస్ పరిశ్రమల చిమ్నీల నుంచి వచ్చే పొగ, వాయువులు ( సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్) ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థ జలాలను 24 గంటలూ అంచనా వేస్తుంది. ఇందులోని సెన్సార్లు, ఎనలైజర్లు ఎప్పటికప్పుడు పొల్యూషన్ లెవెల్స్‌ను కొలిచి ఆ డేటాను నేరుగా టీజీపీసీబీ, సీపీసీబీ సర్వర్‌లకు రియల్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా పంపిస్తుంటాయి. కానీ, పరిశ్రమలు దీని కనెక్టివిటీని కట్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి.
ఎలా కట్ చేస్తున్నాయంటే..
సెన్సార్లు కాలుష్యాన్ని పసిగట్టకుండా వాటి చుట్టూ కెమికల్స్ పూయడం లేదా సెన్సార్ ఫేస్కవరింగ్చేస్తున్నారు. కొన్నిసార్లు తనిఖీలప్పుడు పీక్ వాల్యూస్ రాకుండా రీడింగ్‌లను మానిప్యులేట్ చేసే సాఫ్ట్‌వేర్ ట్రిక్స్ వాడుతున్నారు. పవర్ సప్లై కట్ చేయడం , సిగ్నల్ జామింగ్, రాత్రి.. ఓసీఈఎంఎస్ పరికరాలకు పవర్ సప్లై నిలిపివేయడం, ఇంటర్నెట్సి, సిగ్నల్ కనెక్షన్ కట్ చేయడం ద్వారా డేటా.. బోర్డు సర్వర్లకు చేరకుండా అడ్డుకుంటున్నారు. పీసీబీ అడిగితే ‘టెక్నికల్ ప్రాబ్లం’ , ‘ఇంటర్నెట్ ఫెయిల్యూర్’ అని చెప్పి తప్పించుకుంటున్నారు.
ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తున్నరు..
పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన పరికరాల నుంచి గ్యాస్ లేదా వ్యర్థాలు బయటకు నేరుగా వెళ్లకుండా, మధ్యలో వేరే పైపుల ద్వారా బయటికి వదిలేస్తున్నారు. అప్పుడు సెన్సార్లు ఉన్న ప్రధాన మార్గంలో రీడింగ్ జీరో అవుతుంది. పరిశ్రమలు ఇలా చేస్తున్నాయని తెలిసినా పీసీబీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. పీసీబీలోని టెక్నికల్ వింగ్ దగ్గర ఏ పరిశ్రమ డేటా ఆగిందో, ఏ టైంకు సిగ్నల్ కట్ అయ్యిందో వారి డ్యాష్‌బోర్డుపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిశ్రమలను సీజ్ చేసి మరోసారి ఇలా జరగకుండా చూడాల్సి ఉన్నా నోటీసులతో సరిపెడుతున్నారని తెలుస్తోంది.
శివారులో ఇలా..
శివారులోని బాచుపల్లి, మల్లంపల్లి, నిజాంపేట్ పరిసరాలు, పటాన్‌చెరు, బీరంగూడ, బొల్లారం, జిన్నారం ఇండస్ట్రియల్ జోన్, జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి, మౌలాలి, కుత్భుల్లాపూర్ ప్రాంతాల్లో ఘాటు వాసనల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్న ఫార్మాస్యూటికల్, బల్క్ డ్రగ్స్ తయారీ పరిశ్రమల్లో వివిధ రకాల కెమికల్ సాల్వెంట్స్ ఉపయోగిస్తారు. వీటిలో టోల్యూన్, మిథనాల్, అసిటోన్, డైక్లోరోమీథేన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటాయి. వీటిని గాలిలోకి విడుదల చేస్తే ఆవిరిగా మారి భరించలేని వాసన వస్తుంది. రూల్స్ప్రకారం..బైపాస్ వాల్వులు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసి గాలిలోకి వదలాలి..కానీ, ఖర్చు పెరుగుతోందని ఆ పని చేయడం లేదు. రాత్రి వేళల్లో బైపాస్ వాల్వులను తెరిచి, శుద్ధి చేయని గ్యాస్‌ను నేరుగా గాలిలోకి విడిచిపెడుతున్నారు.
నగరం నడిబొడ్డున ..
శివారు ప్రాంతాలైన జీడిమెట్ల, బొల్లారం, బాచుపల్లి, కాటేదాన్ తో పాటు సిటీలోనే ఉన్న సనత్‌నగర్‌లోని పరిశ్రమల వల్ల నగరం నడిబొడ్డున ఉన్న జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర-పశ్చిమ (నార్త్-వెస్ట్) దిశ నుంచి వీచే మందపాటి గాలి బొల్లారం, బాచుపల్లి, జీడిమెట్ల మీదుగా కూకట్‌పల్లి, బేగంపేట్, పంజాగుట్ట ద్వారా బంజారాహిల్స్ వైపు వస్తోంది. గాలి వేగం తక్కువగా ఉండటం వల్ల ఈ రసాయన వాయువులు త్వరగా పలచన కావడం లేదు.
దట్టమైన కెమికల్ మేఘంలా మెల్లగా కదులుతూ నగరం మధ్యలో కూడా భరించలేని కంపును సృష్టిస్తున్నాయి. ఇదొక తలనొప్పి అనుకుంటే డ్రై క్లీనింగ్ యూనిట్లు, డైయింగ్ షాపుల్లో వాడే పర్క్లో రోఎథిలీన్ తగినంత ఎగ్జాస్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల గాలిలో వ్యాపించి తీవ్రమైన ఘాటు వాసనను వెదజల్లుతోంది. చిన్న యూనిట్లలో వేస్ట్‌వాటర్‌ను శుద్ధి చేయడానికి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు లేక కెమికల్స్‌తో కూడిన మురుగునీటిని రాత్రి పూట మున్సిపల్ డ్రైనేజీలు నాలాల్లోకి వదిలేస్తున్నారు. దీంతో ఇవి డ్రైనేజీలోని చెత్తతో కలిసి కెమికల్ రియాక్షన్‌తో దుర్వాసన వెదజల్లుతున్నాయి.
ఇలా చేయండి..
- రాత్రి ఘాటు వాసన వస్తున్నట్లు గమనిస్తే కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయండి.
- వీలైతే బెడ్రూంలో ఎయిర్ ప్యూరిఫైర్ (హెపా, ఆక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఉన్నది) వాడడం వల్ల రసాయన వాయువుల తీవ్రత తగ్గుతుంది.
- ఉదయం పూట వాసన పూర్తిగా తగ్గే వరకు ఇళ్లలోనే ఉండటం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్ 95 మాస్క్ పెట్టుకుని వెళ్లాలి.
గొంతులో మంట..పొడి దగ్గు..ఊపిరి ఆడకపోవడం..
నగరంలో రోజూ వస్తున్న ఘాటు వాసనలతో గొంతులో మంట, పొడి దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అస్తమా , బ్రోంకైటిస్ ఉన్నవారి తిప్పలు చెప్పరాకుండా ఉన్నాయి. కొందరికి కళ్ల మంటలతో పాటు కళ్లు ఎర్రబడటం, దురద, మంట పుడుతున్నాయి. తలనొప్పి, తల తిరగడం, వాంతులు వచ్చేలా అనిపిస్తుందంటున్నారు. ఘాటు వాసనలతో
గాఢ నిద్రలో ఉంటే ఒక్కసారిగా మేల్కొంటున్నామని, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలతో నిద్ర పట్టడం లేదంటున్నారు.
ఇలాగే కొనసాగితే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుందని, సీవోపీడీ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి తరచూ అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడతారంటున్నారు. బీపీ పెరుగుతుందని, గుండెపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. కొన్ని రకాల పారిశ్రామిక కెమికల్స్ గాలిలో పీల్చుకుంటే మెదడు, నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గడానికి, నిరంతర అలసటకు కారణమవుతాయని చెప్తున్నారు.
