జ్ఞానేశ్‌‌‌‌ను తొలగించాలని  కేరళ అసెంబ్లీ తీర్మానం

జ్ఞానేశ్‌‌‌‌ను తొలగించాలని  కేరళ అసెంబ్లీ తీర్మానం
  •  
  •     ఈసీ ఎంపిక కమిటీలోకి సీజేఐని చేర్చాలి
  •     సీఎం వీడీ సతీశన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పలు సవరణలతో శాసనసభ ఆమోదం
  •     వ్యతిరేకించిన ముగ్గురు బీజేపీ సభ్యులు

 

తిరువనంతపురం: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) విశ్వసనీయతను పునరుద్ధరించాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని, ఈసీ ఎంపిక కమిటీలో సీజేఐని  చేర్చాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం వీడీ సతీశన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్డీఎఫ్ పూర్తి మద్దతు తెలిపాయి. ముగ్గురు బీజేపీ సభ్యులు మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించారు. వారు  కొన్ని సవరణలను ప్రతిపాదించంగా సభ తిరస్కరించింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామ్యానికి పునాది అని సభ అభిప్రాయపడింది. 

ఓటర్ల తొలగింపుపై ఆందోళన

నిబంధనలు పాటించకుండా దేశవ్యాప్తంగా కోట్ల మంది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై సభ ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక కారణాల పేరుతో బలహీన వర్గాలు, మైనారిటీలు, వలస కార్మికులు, యువ ఓటర్ల హక్కులను లాక్కోవడం ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన నిష్పాక్షిక ప్యానెల్ ను పునర్వ్యవస్థీకరించాలని కోరింది.