- సబ్‌జ్యుడిస్ అంశాలపై భేటీ రాజ్యాంగ విరుద్ధం
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి
- ఇండియా కూటమి భేటీ అభ్యర్థనను
- నిరాకరించిన ప్రధాన న్యాయమూర్తి
- మెమొరాండాలు కాదు.. న్యాయపరంగా
- పిటిషన్ దాఖలు చేయాలని సూచన
- కోర్టును రాజకీయాల్లోకి లాగొద్దని హితవు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తలుపులు దేశ ప్రజలందరికీ ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అయితే, కోర్టు పరిధిలో విచారణలో ఉన్న వివాదాలపై పరిపాలనాపరంగా సమావేశాలు జరపడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నిలిపివేత, బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించడంలాంటి డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్ కావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే, న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై ఇలాంటి సమావేశాలు న్యాయపరమైన నిబంధనలకు విరుద్ధమని సీజేఐ తెలిపారు.
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి చేసిన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. సమస్యలపై నేరుగా వినతిపత్రాలు ఇవ్వడం కాకుండా, న్యాయ ప్రక్రియ ప్రకారం పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేశారు. సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాసిన లేఖకు తాను లిఖితపూర్వకంగానే సమాధానమిచ్చినట్టు తెలిపారు. కోర్టును రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు.
అందరికీ న్యాయం పొందే హక్కు ఉంది
సామాన్య పౌరుడి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, ప్రతి ఒక్కరికీ ఆ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం న్యాయస్థానం ముందుకు పిటిషన్‌తో వస్తే, వాటిని నిష్పాక్షికంగా విని చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న (సబ్ జ్యుడిస్) అంశాలపై బయట సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ మౌలిక స్వరూపమైన ‘అధికారాల విభజన’ సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, ఇది న్యాయ విలువలకే విరుద్ధమని స్పష్టం చేశారు.
రిప్రజెంటేషన్లు, మెమొరాండాలు సమర్పించే విధానం న్యాయవ్యవస్థలో సరికాదని, కోర్టుకున్న న్యాయాధికారాలను (జ్యుడీషియల్ పవర్స్) ఆశ్రయిస్తూ అధికారికంగా పిటిషన్ వేయడమే సరైన రాజ్యాంగబద్ధ మార్గమని జస్టిస్ సూర్యకాంత్ తేల్చిచెప్పారు. కోర్టులో భౌతికంగా లేదా ఈ-ఫైలింగ్ ద్వారా పిటిషన్ దాఖలు చేయవచ్చని, చట్టప్రకారం త్వరితగతిన విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి అంశాలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే మంగళవారం విచారణకు రానున్నాయని గుర్తు చేశారు.
