- ఓటీపీ అడగరు.. లింక్ నొక్కించరు..
- ఒక్క మెసేజ్ రిప్లైతోనే ఫోన్ హ్యాక్
- కంగారుపడి స్పందిస్తే జీవితకాల కష్టార్జితం మాయం
- సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ప్లాన్‌తో అమాయకుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఇప్పటివరకు ఓటీపీలు, అనుమానాస్పద లింకులు పంపి మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు..ఇప్పుడు టెక్నికల్ గా మరో అడుగు ముందుకేసి ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ అనే కొత్త తరహా మోసానికి తెరతీశారు. ఈ నయా సైబర్ మోసంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా ప్రజలను హెచ్చరించారు.
మోసం ఎలా జరుగుతుందంటే?
బాధితుల వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఫేక్ మెసేజ్ వస్తుంది. ‘మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం డెబిట్ (కట్) అయ్యింది. ఒకవేళ ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే ‘నో’ అని రిప్లై ఇవ్వాలి’ అని ఉంటుంది. ఖాతాలో డబ్బులు పోయాయేమోననే కంగారులో బాధితులు నిజమేనని నమ్మి ‘నో’ అని రిప్లై ఇవ్వగానే సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు.
ఆ మెసేజ్ వెనుక దాగి ఉండే హిడెన్ లింక్స్, మాల్‌వేర్ స్క్రిప్ట్స్ తక్షణమే యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల బాధితుడి మొబైల్ ఫోన్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఈ విధానంలోనే ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్షలు స్వాహా చేశారు.
ఇలా చేయండి..
రిప్లై ఇవ్వొద్దు : బ్యాంకింగ్ పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్‌లకు ‘ఎస్’ లేదా ‘నో’ అని ఎలాంటి రిప్లై కూడా ఇవ్వకూడదు.
డిలీట్ అండ్ బ్లాక్: అనుమానాస్పద నంబర్ల నుంచి మెసేజ్ రాగానే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, మెసేజ్‌ను డిలీట్ చేయాలి.
స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి: ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే మీ బ్యాంకింగ్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి స్టేట్‌మెంట్ చెక్‌చేసుకోవాలి. బ్యాంకులు కోరవు: ఏ బ్యాంక్ కూడా వాట్సాప్‌లో 'ఎస్' లేదా 'నో' అని రిప్లై ఇవ్వమని కోరదని గుర్తుంచుకోవాలి.
మొదటి గంటే 'గోల్డెన్ అవర్'!
పొరపాటున సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సైబర్ నేరాల్లో మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిWస్తారు. బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలని సిటీ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ‘కంగారులో మీరు ఇచ్చే ఒక్క ‘నో’ రిప్లై.. మీ జీవితకాల కష్టార్జితాన్ని తుడిచిపెట్టేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
