కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్రం తన బెంచ్ ను తప్పించాలని చూస్తోందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రిబ్యూనల్స్ రీఫార్మ్స్ యాక్ట్ (ట్రిబ్యూనళ్ల సంస్కరణల చట్టం) కు సంబంధించి రాజ్యాంగ చట్టం చెల్లుబాటుపై వాదనల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రిబ్యూనల్స్ రీఫార్మ్స్ యాక్ట్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేయాలని కేంద్రం వేసిన పిటిషన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్ తరఫున వాదనలు పూర్తయ్యాయని.. ఈ టైమ్ లో అర్ధరాత్రి పిటిషన్ వేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈకేసులో కేంద్రం పిటిషన్ ను తిరస్కరించారు. తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేశారు.
సీజేఐ బీ.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసుకు సంబంధించి విచారిస్తోంది. పూర్తిగా వాదనలు విన్న తర్వాత విచారణను కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. అదే క్రమంలో ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ (అంతర్జాతీయ మధ్వర్తిత్వం) లో పాల్గొనేందుకు అనుమతించాలని అటార్జీజనరల్ వేసిన పిటిషన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్రం మాతో గేమ్స్ ఆడటమేంటి..?
ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కేంద్రం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇలాంటి వ్యూహాలతో కేంద్రం మాతో ఆటలు ఆడుతుందని అనుకోలేదని అన్నారు. పిటిషనర్ తరఫున వాదనలు పూర్తయిన తర్వాత ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి కేసును ట్రాన్స్ ఫర్ చేయాలని పిటిషన్ వేయడం షాకింగ్ కు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లో తను రిటైర్ అవుతున్నానని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్వేశం అది కాదని.. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మంది జడ్జీలతో కూడి బెంచ్ విచారణ చేయాలని మాత్రమేనని అటార్నీ జనరల్ చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై మండిపడిన జస్టిస్ గవాయ్.. ప్రభుత్వం అర్ధరాత్రి పిటీషన్ వేసింది.. ఇది కోర్టు ప్రొసీజర్స్ ను ఉల్లంఘించడమేనని అన్నారు. ఒకవేళ ఈ కేసుకు ఐదు మంది జడ్జీల బెంచ్ అవసరం ఉందంటే మేము అదే చేస్తాం.. అని ఈ సందర్భంగా అన్నారు.
